నామినేషన్లకు వేళాయే.. | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు వేళాయే..

Published Thu, Apr 18 2024 10:30 AM

నామినేషన్ల
స్వీకరణ : ఏప్రిల్‌ 18 తేదీ నుంచి..   - Sakshi

ఎన్నికల అధికారి

సంగారెడ్డి టౌన్‌ : లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేయనున్న అభ్యర్థుల నుంచి నామినేషన్లను సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ క్రాంతి స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీటిని స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు ఈనెల 25 వరకు గడువు ఉంది. బరిలోకి దిగాలని నిర్ణయానికి వచ్చిన అభ్యర్థులు ముహూర్తం చూసుకుని నామినేషన్లు వేయనున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జహీరాబాద్‌, అందోల్‌, నారాయణఖేడ్‌, జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 16.35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,971 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి నాలుగు సెట్‌ల నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుంటుంది. అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలోకి అనుమతి ఇస్తారు. నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థులు రూ.25 వేలు సెక్యురిటీ డిపాజిట్‌ జమ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 జమ చేయాల్సి ఉంటుంది. నగదు రూపంలో గానీ, చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ పార్టీల తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులకు ఆ నియోజకవర్గంలో ఒక ఓటరు నామినేషన్‌ను ప్రతిపాదిస్తే సరిపోతుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. రిజిష్టర్‌ పార్టీల తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థులు, స్వతంత్రులకు పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసేందుకు కార్యాలయానికి వచ్చే అభ్యర్థులు పార్టీ కండువాలు, టోపీలు ధరించేందుకు అనుమతి ఉండదని అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు నామినేషన్‌పై లెటెస్ట్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో అతికించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన వారై ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థుల ఖర్చు రూ.95 లక్షలు..

అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.95 లక్షల పరిమితి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతా ద్వారానే ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లావాదేవీలు జరిపి రికార్డులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులపై ఏమైనా క్రిమినల్‌ కేసులు ఉంటే నామినేషన్‌ పత్రంలోని పార్ట్‌–3ఏ లో కేసు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి గానీ, ప్రతిపాదించిన వారే స్వయంగా హాజరై నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది.

నామినేషన్‌

చివరి గడువు ఏప్రిల్‌ 25

పరిశీలన

ఏప్రిల్‌ 26

ఉపసంహరణ గడువు

ఏప్రిల్‌ 29

నేటి నుంచి ప్రక్రియ షురూ..

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరణ

ఏర్పాట్లు పూర్తి చేసిన

అధికార యంత్రాంగం

దాఖలుకు చివరితేదీ ఈనెల 25..

ప్రక్రియ ఇలా..

ఓట్ల లెక్కింపు

జూన్‌ 4

పోలింగ్‌ తేదీ

మే 13

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement