గులాబీ శ్రేణుల్లో జోష్‌ | Sakshi
Sakshi News home page

గులాబీ శ్రేణుల్లో జోష్‌

Published Wed, Apr 17 2024 8:20 AM

- - Sakshi

నేను విజిల్‌ వేస్తే..

సాక్షిప్రతినిధి సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌ లోకసభ స్థానం పరిధిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గులాబీ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా భారీగా ఈ సభకు ఆందోల్‌, సంగారెడ్డి, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు, నర్సాపూర్‌ తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, జనాలు తరలివచ్చారు. సాయంత్రం 6.45 ప్రాంతంలో సభాస్థలానికి చేరుకున్నా కేసీఆర్‌.. సుమారు 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రధానంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై విమర్శల దాడి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్‌ సర్కారు విఫలమైందని తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. లిల్లీపుట్‌ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధించిన మాదిరిగానే తిరిగి తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కారును తెస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ హోం మంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement