జోగిపేట మున్సిపల్‌ కమిషనర్‌గా తిరుపతి

పాదయాత్ర చేస్తున్న శ్రీనివాసరెడ్డి - Sakshi

జోగిపేట(అందోల్‌): జోగిపేట మున్సిపల్‌ కమిషనర్‌గా సీహెచ్‌.తిరుపతి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. జోగిపేట కమిషనర్‌గా రవిబాబు ఐదు నెలల క్రితం అదనపు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన మేడ్చల్‌ జిల్లా మెప్మా అధికారిగా ఉంటూ అదనపు కమిషనర్‌ బాధ్యతలు నిర్వహించారు. తిరుపతి పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వహించి సెలవుపై వెళ్లి తిరిగి జోగిపేట కమిషనర్‌గా నియమితులయ్యారు. జోగిపేటకు చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్లు దుర్గేశ్‌, చందర్‌నాయక్‌, నాగరాజు, మాజీ కౌన్సిలర్లు లక్ష్మణ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు నాగరత్నంగౌడ్‌, వి.వెంకటేశ్‌, సంతోష్‌కుమార్‌లు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌ తిరుపతిని శాలువాతో సత్కరించారు.

ముగ్గురికి పాజిటివ్‌

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం 59 మందికి కోవిడ్‌ ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా అందులో ముగ్గురికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు టెస్టుల నిర్వాహకుడు మనోహర్‌ తెలిపారు. అదేవిధంగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు 48 మందికి నిర్వహించినట్లు పేర్కొన్నారు.

పొగాకు వాడకం

ఆరోగ్యానికి హానికరం

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): పొగాకు ఉత్పత్తుల వాడకం ఆరోగ్యానికి హానికరమని జల్లా పొగాకు నియంత్రణ విభాగం సూపర్‌వైజర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం బస్టాండ్‌ వద్ద ప్రజలకు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. పొగాకు ఉత్పత్తులైన బీడీ, చుట్ట, సిగరేట్‌, జర్దా, తంబాకు, పాన్‌ మసాల తదితర ఉత్పత్తులు వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమన్నారు. అలా చేస్తే రూ.200 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి

రామాయంపేట(మెదక్‌): కాంగ్రెస్‌ హయాంలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని దుబ్బాక కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నార్సింగి మండలం న ర్సంపల్లి, పెద్ద తండా, చిన్న తండాలో ఆత్మగౌరవ పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధిని ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇళ్లు నిర్మించుకునే వారికి రూ. ఐదు లక్షలు మంజూరు చేస్తుందని తెలిపారు. రూ. ఐదు వందలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. నార్సింగి మండలం పూర్తిగా వివక్షకు గురైందని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలశాఖ అధ్యక్షుడు గోవర్ధన్‌, జిల్లా నాయకులు గొండస్వామి, యాదగిరి, రఫీక్‌, శ్రీనివాస్‌గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు స్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, నాయకులు సుధాకర్‌, ప్రవీణ్‌రెడ్డి, కుర్షీద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top