నేడు రాగన్నగూడకు రాంచందర్‌ రావు రాక | - | Sakshi
Sakshi News home page

నేడు రాగన్నగూడకు రాంచందర్‌ రావు రాక

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

నేడు రాగన్నగూడకు రాంచందర్‌ రావు రాక బహిరంగ సభను విజయవంతం చేయాలి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు అభివృద్ధి పనులను అడ్డుకోవడం తగదు

తుర్కయంజాల్‌: ఆదిబట్ల సర్కిల్‌ పరిధి రాగన్నగూడలోని జీఎంఆర్‌ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించనున్న కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు రానున్నట్లు పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్ఫూర్తి ఫౌండేషన్‌ చైర్మన్‌ డా.బాసరాజు సురేష్‌తో పాటు పలువురు పార్టీలో చేరనున్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

కందుకూరు: బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తెలంగాణ చైర్మన్‌ డాక్టర్‌ విశారదన్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో షాద్‌నగర్‌లో ఈ నెల 28న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్రముదిరాజ్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ గుండ్రపల్లి అమరేందర్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎవరి కులం ఎంత ఉందో వారికన్ని రాజ్యంగ పదవులతో పాటు చదువు, ఉద్యోగాల్లో అంత వాటా ఇవ్వాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు తరతరాలుగా దోపిడీకి గురై బానిసలుగా నలిగిపోతున్నారన్నారు. బహుజన సామాజిక వర్గాలకు చెందిన రాజ్యాధికారం సాధించడం కోసం భారీగా సభకు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జి.మహిపాల్‌, సీహెచ్‌ ఆంజనేయులు, జి.భాస్కర్‌, రజక సంఘం మండల నాయకుడు శ్రీను పాల్గొన్నారు.

షాద్‌నగర్‌: ప్రజలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాసులు అన్నారు. మండల పరిధిలోని ఎలికట్ట గ్రామంలో శుక్రవారం చించోడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధ్వర్యంలో టీబీ వ్యాధికి సంబంధించి ఉచిత ఎక్స్‌రే క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ అనేది అంటు వ్యాధి అని, ఎవరికై నా రెండు వారాలకు మించి దగ్గు, రాత్రి పూట జ్వరం రావడం, చెమటలు పట్టడం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, అలసట రావడం, కఫంలో రక్తం రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఎవరూ భయపడొద్దని సరైన చికిత్సతో వ్యాధిని పూర్తిగా నయం చేయొచ్చని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్‌ ప్రవీణ, సిబ్బంది జహీందర్‌, రవికుమార్‌, సర్పంచ్‌ నవకిరణి, పంచాయతీ కార్యదర్శి తేజస్విని, ఏఎన్‌ఎంలు సుమతమ్మ, సుజాత, పుష్పలత, ఆశా వర్కర్లు హైమావతి, లలిత, సుమలత, యాదమ్మ, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.

యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో జరిగే అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని.. కోర్టుల్లో కేసులున్న రైతులు పరిహారం పెంపు కోసం అథారిటీని ఆశ్రయించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి రైతులకు సూచించారు. నానక్‌నగర్‌లో శుక్రవారం గ్రామస్తులు, రైతులతో మాట్లాడారు. రైతుల భూ సమస్యలు, పరిహారం చెల్లింపు విషయమై త్వరలో కలెక్టర్‌ నారాయణరెడ్డితో మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నారు. నింబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా వ్యహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్‌ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement