‘గుర్తు’ంచుకోండి.. గెలిపించండి | - | Sakshi
Sakshi News home page

‘గుర్తు’ంచుకోండి.. గెలిపించండి

Dec 9 2025 10:43 AM | Updated on Dec 9 2025 10:43 AM

‘గుర్

‘గుర్తు’ంచుకోండి.. గెలిపించండి

షాద్‌నగర్‌: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్‌, వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి తమకు కేటాయించిన గుర్తును చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తెల్లవారింది మొదలు రాత్రి వరకు గడగడపనూ చుట్టేస్తున్నారు. మొదటి విడత షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాల్లో 168 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తూరులో 12 పంచాయతీల్లో 110 వార్డులకు, నందిగామలో 18 పంచాయతీల్లో 170 వార్డులకు, కేశంపేటలో 28 పంచాయతీల్లో 260 వార్డులకు, కొందుర్గులో 19 పంచాయతీల్లో 186 వార్డులు, జిల్లేడు చౌదరిగూడలో 24 పంచాయతీల్లో 204 వార్డులు, ఫరూఖ్‌నగర్‌లో 46 పంచాయతీల్లో 410 వార్డులు, శంషాబాద్‌లో 21 పంచాయతీల్లో 190 వార్డులకు, సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.

ప్రచారానికి మిగిలింది ఒక్కరోజే

మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే ప్రచార పర్వం ముగియనుంది. ఒక్కరోజే మిగిలుండడంతో అభ్యర్థులు స్పీడ్‌ పెంచారు. సర్పంచ్‌, వార్డు సభ్యులు వారికి కేటాయించిన గుర్తులను పోస్టర్లు, కండువాలపై ముద్రించి వాటిని ఇంటింటికీ వెళ్లి చూపిస్తూ ఒకటికి రెండుసార్లు గుర్తు చేస్తున్నారు. ఆటోలకు మైకులు అమర్చి, పాటలు, మాటల రూపంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నమూనా బ్యాలెట్‌ పేపర్లను ఇంటింటికీ తీసుకెళ్లి చూపిస్తున్నారు.

సామాజిక మాద్యమాల్లో..

ఈసారి సామాజిక మాద్యమాల్లో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందుకు గాను వాట్సాప్‌లో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్‌, ఇస్ట్రాగామ్‌లను సైతం వినియోగించుకుంటున్నారు. అభ్యర్థుల గుర్తులతో కూడిన ఫొటోలు, వీడియోలు రూపొందించుకొని సామాజిక మాద్యమాల ద్వారా ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రచారం చేస్తున్నారు.

హామీలు గుప్పిస్తూ..

ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాము విజయం సాధిస్తే గ్రామాన్ని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని హామీలు గుప్పిస్తున్నారు. గతంలో పదవులు చేపట్టి తిరిగి ఎన్నికల్లో నిలిచిన వారు గ్రామానికి ఐదేళ్ల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. తమకు మద్దతు తెలుపుతున్న పార్టీ అధికారంలో ఉందని, గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అఽధికార పార్టీ మద్దతుదారులు హామీలు ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధికి సొంత ఎజెండాను రూపొందించారు.

పల్లెల్లో ప్రచార జోరు

గెలుపే లక్ష్యంగా పావులు

ఓటర్లకు ఒకటికి రెండు సార్లు ‘గుర్తు’ చేస్తున్న అభ్యర్థులు

మొదటి విడత ఎన్నికలకు నేటితో ముగియనున్న ప్రచార పర్వం

‘గుర్తు’ంచుకోండి.. గెలిపించండి1
1/1

‘గుర్తు’ంచుకోండి.. గెలిపించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement