నూతన విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలి
తుర్కయంజాల్: విత్తన బిల్లు 2025ను రైతులంతా వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ పిలుపునిచ్చారు. విత్తన బిల్లును వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చి న పిలుపు మేరకు సోమవారం తుర్కయంజాల్‌లో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం 1966 విత్తన చట్టాన్ని రద్దు చేసి తీసుకువస్తున్న కొత్త చట్టంతో విత్తన సరఫరాలో బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ శక్తుల నియంత్రణ పెరుగుతుందని అన్నారు. ఆహార భద్రత, విత్తన స్వావలంబన, రాష్ట్రాల హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. వ్యవసాయ సంక్షోభానికి దారితీసే పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, ఎలీషా, రాము, ముత్తయ్య, యాదగిరి, అండాలు, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.


