మెడికల్ విద్యార్థుల ఆందోళన
ఇబ్రహీంపట్నం రూరల్: కళాశాలలో సరైన సౌకర్యాలు లేవని.. చదువులు సక్రమంగా సాగడం లేదని మెడికల్ కళాశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మహేశ్వరం మెడికల్ కళాశాల ప్రస్తుతం ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతోంది. సరైన సౌకర్యాలు లేక సతమతమవుతున్నామని, బస్సు, హాస్టల్ వసతి కల్పించాలని కోరుతూ సోమవారం విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. హాస్టల్ వసతి లేకపోవడంతో నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేలు వెచ్చించాల్సి వస్తోందన్నారు. పేద విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉండి చదవలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లు, కాలేజీలో విద్యార్థినులకు రక్షణ కరువైందన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నూతన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


