చేతిలోనే వైరస్..
అబ్దుల్లాపూర్‌మెట్: సెల్‌ఫోన్, కంప్యూటర్ కీబోర్డు, టీవీ రిమోట్, కరెన్సీ నోట్లు, లిఫ్ట్ తదితర వస్తువులు నిత్యం మనం వినియోగించే నేస్తాలు. ఈ క్రమంలో మనకు తెలియకుండానే, ఎంత పరిశుభ్రంగా ఉన్నా.. వీటిపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా(ఏకకణ సూక్ష్మజీవులు) అవశేషాలు పోగుపడుతున్నాయి. కంటికి కనిపించకుండా మన వెంటే ఉంటుంది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా మైక్రోబయాలజీ విభాగం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కొన్ని ఆశ్ఛర్యకరమైన వివషయాలు వెలుగు చూశాయి. మనం రోజు వారీ చేసే పనుల్లో కొన్ని ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తాయని వెల్లడవడం షాక్‌కు గురిచేస్తోంది. ఇలా వాడే ఏ వస్తువులో ఎలాంటి బ్యాక్టీరియా ఉందో, దాని వలన కలిగే నష్టం గురించి తెలుసుకుందాం..
ఫోన్ ద్వారా చేరువగా..
నిత్యం రకరకాల వస్తువులను పట్టుకుంటాం. ఆ చేతితోనే సెల్‌ఫోన్లు వాడతాం. దీంతో బ్యాక్టీరియా ఫోన్ ద్వారా మనకు చేరువ కాగా.. అవే చేతులతో ఆహార పదార్థాలు తింటే రోగాలను కొని తెచ్చుకున్నట్లే. సెల్‌ఫోన్ స్క్రీన్‌పై సుమారు 25 వేల క్రిములు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. మొత్తం 250 ఫోన్లను పరీక్షించి 94.5 శాతం ఫోన్లపై బ్యాక్టీరియా అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏమిటంటే.. బాత్‌రూంలో ఉండే బ్యాక్టీరియా కంటే 18 రేట్లు ఎక్కువ సెల్‌ఫోన్లే ప్రమాదకర బ్యాక్టీరియాకు నిలయమని అవగతమవుతోంది. సాఫ్ట్ కోకస్, కోయాడ్యుటేజ్ నెగిటివ్ స్టాఫ్ వంటి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. వీటి వలన రక్తంలో ఇన్ఫెక్షన్, చర్మ, ఎముకల సంబంధిత వ్యాధులు వచ్చేఅవకాశం ఉంది.
కీ బోర్డు, రిమోట్‌తో జాగ్రత్త
కార్యాలయాలు, ఇంట్లో వాడే కంప్యూటర్లు, లాప్‌టాప్ కీబోర్డులు అత్యంత ప్రమాదకరమైనవే.. పీసీ స్క్రీన్, కీబోర్డు, మౌసులు కూడా బ్యాక్టీరియాకు చిరునామాగా మారాయి. ఇంట్లో ఉండే కీబోర్డుల కంటే.. నెట్ సెంటర్లు, సైబర్ కేఫ్‌లలో ఉండే వాటిపై వందరెట్ల క్రిములు అధికంగా ఉంటాయని పరిశోధనలో తేలింది. ఎంటిరోకేకస్, పీజీఎం స్టాఫికోకస్ వంటి క్రిములు వీటిపై ఆవహించిఉంటాయి. వీటితో ఊపిరితిత్తుల వ్యాధులు, రక్తంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇక ప్రతిఇంట్లో టీవీ తప్పనిసరి. దాని రిమోట్‌ను కుటుంబీకులు అందరూ ఆపరేట్ చేస్తుంటారు. ఫలితంగా దగ్గినా.. తుమ్మినా వైరస్ దీనికి చేరువవుతుంది. ఒక్కో టీవీపై 324 రకాల క్రిములు ఉంటాయని అంచనా. టీవీల కంటే రిమోట్లు అత్యంత ప్రమాదకరమైనవి. హోటళ్లు, ఆస్పత్రుల్లోని రిమోట్లలో బ్యాక్టీరియా అధికంగా పోగుపడి ఉంటుంది.
కరెన్సీ నోట్లు ప్రమాదకరమే..
నిత్య వినియోగంలో ఉండే కరెన్సీ కోట్లాది మంది చేతులు మారుతుంది. వీటిపై అధిక శాతం క్రిములు ఉంటాయి. పేపర్ ఆధారిత కరెన్సీ నోట్లపై బ్యాక్టీరియా అధికంగా చేరుతుంది. కొన్ని అంగులం వెడల్పు ఉండే నోట్లపై 100కు పైగా క్రిములు ఆశించి ఉంటాయి. అవి మన శరీరంపై శరవేగంగా దాడి చేస్తాయి.
లిఫ్ట్ బటన్..
నగరంలో గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్ కల్చర్ విపరీతంగా పెరిగింది. ప్రతి చోట లిఫ్ట్లు ఉండడం సాధారణంగా మారింది. కామన్ లిఫ్ట్ బటన్ బ్యాక్టీరియా స్థావరంగా చెప్పొచ్చు. షాపింగ్ మాల్స్, ఆస్పత్రుల్లో కొన్ని వందల మంది బటన్లు నొక్కుతుంటారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాటిపై.. నివాస ప్రాంత బటన్ల కంటే వంద రెట్లు ఎక్కువ క్రిములు ఉంటాయి.
నిత్య నేస్తాలు.. బ్యాక్టీరియాకు ఆవాసం
ఆరోగ్యానికి పొంచిఉన్న ముప్పు
పరిశుభ్రతే రక్ష.. నిర్లక్ష్యం చేస్తే శిక్ష
అప్రమత్తత అవసరం..
నిత్యం వాడే వస్తువులపై బ్యాక్టీరియా, వైరస్లు చేరడం సాధారణ అంశం. క్రిములు 24 గంటలు జీవిస్తాయి. సెల్‌ఫోన్, రిమోట్, కంప్యూటర్లు వినియోగించిన తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్స్, శానిటైజర్స్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. లేని పక్షంలో ఆహార పదార్థాలు తింటే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. – డాక్టర్ సందీప్, కొత్తపేట
చేతిలోనే వైరస్..


