స్కూటర్‌ను ఢీకొట్టిన కారు
వ్యక్తికి గాయాలు
మొయినాబాద్: యూటర్న్ తీసుకుంటున్న స్కూటర్‌ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన జుంజూరి సామయ్య కూలి పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన స్కూటర్‌పై వెళ్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా మొయినాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు (టీఎస్ 09 ఎఫ్‌వీ 4815) వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సామయ్య తల, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి నుంచి వెళ్లిన మహిళ అదృశ్యం
మొయినాబాద్: కూతురును ఇంట్లో వదిలి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిలుకూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని చిలుకూరుకు చెందిన కనగల్ల శ్రీలత (30) హౌస్‌కీపింగ్ పనిచేస్తోంది. అక్టోబర్ 27న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురు రిషికను ఇంట్లో వదిలేసి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా శ్రీలత ఇలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


