ఔటర్‌పై.. ఘోర ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై.. ఘోర ప్రమాదం

Jul 19 2025 1:15 PM | Updated on Jul 19 2025 1:15 PM

ఔటర్‌

ఔటర్‌పై.. ఘోర ప్రమాదం

ఇబ్రహీంపట్నం రూరల్‌/ఇబ్రహీంపట్నం/మొయినాబాద్‌: బతుకుదెరువుకోసం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చారు. నిత్యం పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏసీపీ కేపీవీ రాజు, సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లికి చెందిన కావలి బాల్‌రాజ్‌ (40) చికెన్‌సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. వరంగల్‌ జిల్లా మాసంపల్లితండాకు చెందిన మాలోతు చందులాల్‌ (29), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం జిల్లా కలంరాజుపేటకు చెందిన జడ కృష్ణ (25) మొయినాబాద్‌లోని డ్రీమ్‌ వ్యాలీ రిసార్ట్‌లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వెదుళ్లవలసకు చెందిన దాసరి భాస్కర్‌రావు (39) డ్రీమ్‌ వ్యాలీ రిసార్ట్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మహబూబబాద్‌ జిల్లా దాసరితండాకు చెందిన గుగులోతు జనార్దన్‌ (45) మొయినాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని సోలార్‌ విల్లాస్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. బాల్‌రాజ్‌ నిర్వహిస్తున్న చికెన్‌ సెంటర్‌ వద్దకు వీరంతా తరచూ వస్తుండడంతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అందరూ స్నేహితులుగా మారారు. గురువారం రాత్రి బాల్‌రాజ్‌ సొంత కారు (టీఎస్‌ 07 హెచ్‌డబ్ల్యూ 5858) తీసుకొని ఐదుగురూ కలిసి యాదగిరిగుట్టకు వెళ్లారు. దర్శనం అనంతరం శుక్రవారం తెల్లవారు జామున ఘట్కేసర్‌ నుంచి మొయినాబాద్‌కు ఔటర్‌రింగ్‌రోడు మీదుగా వస్తుండగా బొంగ్లూర్‌ ఎగ్జిట్‌ నంబర్‌ 12కు సమీపంలో 108 కేఎం వద్దకు రాగానే నిద్రమత్తు, అతివేగంతో కారు డ్రైవింగ్‌ చేస్తున్న చందులాల్‌ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. కారు లారీ వెనుకభాగంలో ఇరుక్కుపోవడంతో కారు నుజ్జునుజ్జయింది. జనార్దన్‌, చందులాల్‌, బాల్‌రాజ్‌, భాస్కర్‌రావు కారులోనే ఇరుక్కుపోయి దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. కృష్ణ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. చందులాల్‌కు జనార్దన్‌ వరుసకు బాబాయ్‌ అవుతాడు.

వైద్యుల పనితీరుపై మాజీ ఎంపీ ఆగ్రహం

వైద్యుల పనితీరుపై మహబూబాబాద్‌ మాజీ ఎంపీ మాలోతు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల్లో మహబూబాబాద్‌ నియోజకవర్గానికి చెంది నవారు ఉండడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఆమె ఉదయం పది గంటలకు ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అప్పటికి పోస్టుమార్టం కోసం మృతదేహాలను తీసుకెళ్లకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత వైద్యుడు జవార్‌తో ఫోన్‌లో మాట్లాడగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆమె మండిపడ్డారు. ఉదయం ఆరున్నర గంటలలోపు మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొస్తే పదిన్నర గంటలు కావస్తున్నా వైద్యులు అందుబాటులో లేరన్నారు. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఫోన్‌లో వివరించారు.

రోదనలతో మిన్నంటిన ఆస్పత్రి ప్రాంగణం

నలుగురి మృతదేహాలను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకుని అయ్యో దేవుడా ఎంత పని చేశావంటూ బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కృష్ణ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు.

బాధితులను ఓదార్చిన డీసీపీ

మహేశ్వరం జోన్‌ డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐ రాఘవేందర్‌రెడ్డి ఔటర్‌పై జరిగిన ఘటనను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి విచ్చేసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బాల్‌రాజ్‌ కుటుంబంలో విషాదం

చికెన్‌సెంటర్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బాల్‌రాజ్‌ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. స్నేహితులతో కలిసి వెళ్లిన బాల్‌రాజ్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాల్‌రాజ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బాల్‌రాజ్‌ మరణంతో కుటుంబంలో మగదిక్కులేకుండా పోయిందని బందువులు, మహిళలు బోరున విలపించారు.

బతుకుదెరువుకోసం వచ్చి..

రిసార్స్‌లో డ్రైవర్‌లుగా పనిచేస్తున్న చందులాల్‌, కృష్ణ, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న భాస్కర్‌రావు, సోలార్‌ విల్లాస్‌లో కూలీగా పనిచేస్తున్న జనార్దన్‌ ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువుకోసం వచ్చారు. కుటుంబాలను వది లి వచ్చిన వారంతా రోడ్డు ప్రమాదంలో మృతి చెంది కుటుంబాల్లో విషాదాన్ని నింపారు.

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..

అతివేగంతో వెళ్లి లారీని ఢీకొట్టిన కారు

నలుగురు అక్కడికక్కడే దుర్మరణం

చికిత్స పొందుతూ మరొకరి మృతి

రెండు గంటలు శ్రమించి మృతదేహాల వెలికితీత

రోదనలతో మిన్నంటిన ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ

ఔటర్‌పై.. ఘోర ప్రమాదం 1
1/1

ఔటర్‌పై.. ఘోర ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement