
ఇందిరమ్మ ఇళ్లలో పారదర్శకత ఏదీ?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా జరగాల్సిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలకే అన్నట్లుగా ఉంది’ అని చేవెళ్ల ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొనసాగిందని ఆరోపించారు. అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అనర్హులకు ఇళ్లు కేటాయించడంతో వాళ్లు కట్టుకోలేక.. ఈ ఇళ్లు మాకొద్దు అంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ తిప్పి పంపుతున్నారని గుర్తు చేశారు. కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ)సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయం, పశు సంవర్థకశాఖ, పరిశ్రమలు, బ్యాంకింగ్ రుణాలు, మైనింగ్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్యశాఖ, పౌర సరఫరాల, శిశు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మత్స్య, మార్కెటింగ్, గృహ నిర్మాణ శాఖల పనితీరును సమీక్షించారు.
దిశ అంటే ఓ మార్గం.. అభివృద్ధి
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దిశ అంటే ఒక మార్గం, అభివృద్ధి అని, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్‌ల వివరాలను అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో పుట్టగొడుగుల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లా మత్స్యకారులకు చేపలు పట్టే విధానంపై శిక్షణ ఇవ్వక పోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు..ఇక్కడికి వచ్చి చెరువులను లీజుకు తీసుకుని లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని మత్స్యకారులకు శిక్షణ ఇప్పించి, ఆర్థికంగా తోడ్పడాలని సూచించారు. కేంద్ర పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు.
నిలదీసిన సభ్యులు..
ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పాలిహౌస్‌లు దెబ్బతిన్నాయని, పునరుద్ధరణకు ప్రభుత్వం సాయం చేస్తుందా అని చేవెళ్ల ఎమ్మెల్యే, కమిటీ సభ్యుడు కాలె యాదయ్య ప్రశ్నించారు. మొయినాబాద్, చేవెళ్ల, శంషాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో పూల సాగు అధికంగా ఉంది. రైతులు రాత్రి పూట పూలు కోసి, అదేరాత్రి మార్కెట్‌కు తెస్తున్నారు. అక్కడి ఏజెంట్లు రైతుల నుంచి పది శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. నిలువు దోపీడీ చేస్తున్న ఏజెంట్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి అధికారుల దృష్టికి తెచ్చారు. లెనిన్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని రెండేళ్ల క్రితం కూల్చివేశారు. ఇప్పటికీ భవనం పూర్తి చేయలేదు అప్పటి వరకు అక్కడ చదువుకునే పిల్లలంతా చెల్లా చెదురైపోయారు అని మరో సభ్యుడు ఎ.శ్రీనివాస్ అన్నారు. ఇన్నర్ టు ఔటర్‌ను కలిపే పలు మార్గాలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని, ఆ రహదారుల పనులను వెంటనే పూర్తి చేయాలని సభ్యుడు తోకల శ్రీనివాసరెడ్డి కోరారు. పశు సంవర్థకశాఖ కమిటీకి సమర్పించిన నివేదిక అసమగ్రంగా రూపొందించడంపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశానికి తప్పని కరెంట్ కటకట
అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సభ్యులంతా సీరియస్‌గా చర్చిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కీలక సమావేశం జరుగుతున్న సమయంలో పలు మార్లు రెంట్ నిలిచిపోవడంపై సభ్యులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలకే అన్నట్లుగా ఉంది
అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు
కేంద్ర పథకాలను పక్కాగా అమలు చేయాలి
చేవెళ్ల ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సమీక్ష సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించిన సభ్యులు