
ఎనికేపల్లి రైతులకు న్యాయం చేయండి
మొయినాబాద్: గోశాల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న ఎనికేపల్లి రైతులకు సమన్యాయం చేయాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించారు. ఈమేరకు శుక్రవారం రైతులతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పరిహారంకోసం రైతులు రిలే దీక్ష చేస్తుంటే కొంత మందిని విడదీసి పట్టాలు ఇవ్వడం సరికాదన్నారు. రైతులను ఒప్పించి వారికి సరైన పరిహారం ఇవ్వాలన్నారు. కలెక్టర్‌ను కలిసినవారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మోర నర్సింహారెడ్డి, నాయకులు వైభవ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, రైతులు ఉన్నారు.
భూములు పరిశీలించిన సీపీఎం నాయకులు
ఎనికేపల్లి రైతులకు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రైతులు చేపడుతున్న రిలే దీక్షలో శుక్రవారం ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేటు గోశాలకు ప్రభుత్వం 99.14 ఎకరాల భూములు ఇవ్వడం సరికాదన్నారు. తరతరాలుగా భూమినే నమ్ముకుని జీవనాధారం పొందుతున్న పేద రైతులనోట్లో మట్టి కొట్టొద్దన్నారు. పేదల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కొని బడాబాబులకు కట్టబెడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, జగదీష్, నాయకులు జగన్, ప్రకాష్ కారత్, అల్లి దేవేందర్, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకటయ్య, అరుణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.