పల్లెల్లో మందుపాతర్లు!
రోజుకు రూ.2 కోట్ల విక్రయాలు ఓటర్లకు కిక్కు.. వ్యాపారులకు లక్కు మద్యం వ్యాపారులకు కలిసొచ్చిన ఎన్నికలు వైన్స్‌లు 48.. బెల్ట్‌షాపులు 1025
ఇది కోనరావుపేట మండలం బావుసాయిపేట. ఈ ఊరిలో అనధికారికంగా తొమ్మిది బెల్ట్‌షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్‌షాపుల్లో సగటున నిత్యం రూ.2లక్షల మద్యం విక్రయాలు సాగుతాయి. ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిత్యం రూ.3లక్షలకు చేరాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో బెల్ట్‌షాపుల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉంది.
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో మద్యం విక్రయాలు రెట్టింపయ్యాయి. బెల్ట్‌షాపుల్లో వ్యాపారం జోరందుకోగా.. గల్లీల్లో మద్యం పారుతోంది. సాయంత్రం అయిందంటే చాలు సర్పంచ్ అభ్యర్థులు తన అనుయాయుల ద్వారా ఓటర్లకు మద్యం అందజేస్తున్నారు. దీంతో ఇటీవల జిల్లాలో మద్యం వ్యాపారం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 48 వైన్స్‌షాపులకు, ఏడు బార్లకు అనుమతి ఉండగా.. 1025 బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. నిత్యం రూ.1.50కోట్ల మద్యం విక్రయాలు సాగుతాయి. ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు మరో రూ.50 లక్షలు పెరిగింది. అంటే నిత్యం రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. లైసెన్స్ ఉన్నట్లుగానే బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. పుణ్యక్షేత్రం వేములవాడలోని బెల్ట్‌షాపుల నిర్వాహకులు మద్యం బాటిళ్లను డోర్ డెలివరీ చేయడం దారుణం. ఫోన్‌చేస్తే చాలు కోరిన మద్యం.. చెప్పిన చోటికి నిమిషాల్లో చేరుతుంది.
ధరలు పెంచి దోపిడీ
సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు అన్ని పల్లెల్లోనూ హోటళ్లు, కిరాణషాపుల కేంద్రంగా బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. ఈ బెల్ట్‌షాపుల్లో మద్యం ధరలు పెంచి అమ్ముతుంటారు. క్వార్టర్ నుంచి ఫుల్‌బాటిళ్ల వరకు లిక్కర్ ధరలు ఇష్టానుసారంగా పెంచారు. ప్రతీ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.200 వరకు బ్రాండ్‌ను బట్టి ధరలు పెంచి అమ్ముతున్నారు. బెల్ట్‌షాపుల నిర్వాహకుల వద్ద వైన్స్‌షాపుల నిర్వాహకులు నెలకు రూ.2వేల చొప్పున వసూలు చేసి ప్రతీ వైన్‌షాపు నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్లలో రూ.15వేల నుంచి రూ.20వేలు, ఎకై ్సజ్ అధికారులకు రూ.15వేల చొప్పున మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎకై ్సజ్ అధికారులు అప్పుడప్పుడూ బెల్ట్‌షాపులపై దాడులు చేస్తున్నా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే సాకుతో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్‌షాపులు పల్లెల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి.
మద్యం వ్యాపారులకు లక్కు !
కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చిన వారికి పంచాయతీ ఎన్నికలు అదృష్టంగా మారాయి. మద్యం విక్రయాలు పెరగడంతో పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కులసంఘాల పెద్దలకు, తమకు అనుకూలంగా ఉన్న వారికి విందులు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు బెల్ట్‌షాపులపై దాడులు చేస్తూ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా గుట్టుచప్పుడు కాకుండా బెల్ట్‌షాపుల్లో లిక్కర్ విక్రయాలు సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో భారీ ఎత్తున మద్యం నిల్వలు ఉన్నాయి. పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు నిఘా పెట్టి మద్యం కట్టడి చేస్తే ఎన్నికల వేళ గొడవల జరగకుండా అడ్డుకోవచ్చు.


