ముగిసిన ఉపసంహరణల పర్వం
● రెండో విడతలో గుర్తుల కేటాయింపు ● మూడో విడతలో పరిశీలన ● తారాస్థాయికి పంచాయతీ పోరు
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో పంచాయతీ పోరు ఊపందుకుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుండగా, రెండో విడత జీపీల్లో గుర్తుల కేటాయింపు పూర్తయింది. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో వచ్చిన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. బోయినపల్లి మండలంలోని 23 జీపీలకు 90 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎంపీడీవో భీమా జయశీల శనివారం రాత్రి తెలిపారు. 212 వార్డుస్థానాలకు 46 మంది ఏకగ్రీవం కాగా, మిగతా 166 వార్డుల్లో 437 మంది బరిలో ఉన్నారు. మండలంలోని కొత్తపేటలో 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
గుర్తుల కేటాయింపు
ఇల్లంతకుంట: మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల ఎన్నికల ఆర్వో కేంద్రాలలో అభ్యర్థుల ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న సర్పంచ్, వార్డ్‌మెంబర్లకు గుర్తులు కేటాయించారు. మండలంలోని 11 ఆర్వో కేంద్రాలు ఉన్నాయి. మండలంలోని 35 గ్రామపంచాయతీలకు 8 ఏకగ్రీవంకాగా.. 27 గ్రామపంచాయతీలకు 79 మంది పోటీలో ఉన్నట్లు ఎంపీడీవో శశికళ తెలిపారు. 294 వార్డులకు 104 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 190 వార్డులకు 454 మంది బరిలో మిగిలారని వివరించారు.
గుర్తుల కేటాయింపులో గందరగోళం
తంగళ్లపల్లి: మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీలో గుర్తులు కేటాయింపులో గందరగోళం నెలకొంది. సర్పంచ్ పోటీకి మొదటి స్థానంలో ఉన్న అంకారపు రవీందర్, రెండో స్థానంలో ఉన్న ఇటికాల మహేందర్‌కు కేటాయించిన గుర్తులు మార్చాలని మరో సర్పంచ్ అభ్యర్థి మోర లక్ష్మీరాజం ఫిర్యాదు చేశారు. తెలగు వర్ణమాల ప్రకారం ‘అ’ కాకుండా ‘అం’ ప్రకారం కేటాయించాలని వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం కలెక్టర్ వరకు వెళ్లింది.
బరిలో 142 మంది
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని 26 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు 204 మంది నామినేషన్లు వేయగా, పరిశీలన అనంతరం 142 నామినేషన్లను అధికారులు ఓకే చేశారు. 226 వార్డులకు 571 మంది నామినేషన్ వేశారు. పరిశీలన అనంతరం 542 నామినేషన్లను అధికారులు ఓకే చేశారు. గుంటపల్లిచెరువు తండా నుంచి భూక్య తిరుపతినాయక్ ఒక్కరే నామినేషన్ దాఖరు చేశారు. 26 వార్డులకు ఒకే నామినేషన్ పడడంతో ఏకగ్రీవం కానున్నాయి.
ఒక నామినేషన్ తిరస్కరణ
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని 22 గ్రామాల సర్పంచ్ ఎన్నికలలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు ఎంపీడీవో లచ్చాలు తెలిపారు. 22 సర్పంచ్ స్థానాలకు 171 నామినేషన్లు రగా.. ముస్తాబాద్ మేజర్ పంచాయతీలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. 105 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 202 వార్డులకు 545 నామినేషన్లు వచ్చాయి. ముస్తాబాద్ మేజర్ పంచాయతీలోని ఒకటో వార్డులో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఏకగ్రీవాలు పోను 518 మంది వార్డు అభ్యర్థులు బరిలో నిలిచారు.


