ఎన్నికల సరళిని పరిశీలించాలి
నిబంధనలు అతిక్రమిస్తే నివేదించాలి
ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఓ టింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమ ని, ఎన్నికల సరళిని నిషితంగా పరిశీలించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో శనివారం మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌కు ముందు, తర్వాత నిశితంగా పర్యవేక్షించి నివేదికను అందించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా ఎన్ని కల సాధారణ పరిశీలకులు రవికుమార్, డీఆర్డీవో శేషాద్రి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీపీవో షరీఫొద్దీన్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఎల్‌డీఎం మల్లికార్జునరావు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు
మొదటి విడత ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు నియామకపత్రం, ఫామ్–14, ఎపిక్ కార్డుతో తమ సొంత మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి సమర్పించాలని సూచించారు. అక్కడే ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఓటుహక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.


