నిబంధనలు పాటించాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు(ఆర్వో)లకు కలెక్టరేట్‌లో సోమవారం ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించారు. ఆర్వోలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని సూచించారు. వసతులు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సరిచూసుకునేలా పీవోలు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్, డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీపీవో షరీఫొద్దీన్, నోడల్ అధికారి భారతి పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో రూ.338 కోట్లు
సిరిసిల్లకల్చరల్: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా సోమవారం మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.338కోట్లు మంజూరయ్యాయని.. వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని సూచించారు. 32,085 మంది నుంచి 1,98,426 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. మిగిలిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని సూచించారు.


