పైసల చుట్టే ‘పంచాయతీ’!
‘లక్ష’ణంగా ఏకగ్రీవం
పోటీకి ముందే ‘లక్ష’ణమైన బేరాలు
నామినేషన్ల ఉపసంహరణకు అదే బాట
మొదటి విడతకు రేపు నామినేషన్ల ఉపసంహరణ
85 సర్పంచ్ స్థానాలకు 385 మంది..
1,624 వార్డులకు 748 మంది పోటీ
అదో మారుమూల గిరిజనతండా. గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డుసభ్యులతో సర్పంచ్ స్థానానికి ఒక్కో నామినేషన్ వేశారు. దీంతో ఆ ఊరిలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైనట్లు ప్రకటించాల్సి ఉంది. కానీ తెరవెనుక ఏం జరిగిందంటే.. ఆ ఊరి సర్పంచ్ అభ్యర్థి రూ.11లక్షలు, ఉపసర్పంచ్ అభ్యర్థి రూ.1.60 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని అంగీకరించడంతో ఏకగ్రీవానికి ఆ గిరిజనతండా జనం అంగీకరించారు.
జిల్లాలో మరో మారుమూల గిరిజనతండాలోనూ గ్రామ సర్పంచ్‌తో సహా వార్డుసభ్యుల స్థానాలు ఒక్కో నామినేషన్ వేశారు. అధికారికంగా ఏకగ్రీవమైనట్లు ప్రకటించాల్సి ఉంది. కానీ తెరవెనుక గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.10లక్షల విలువైన తన సొంత భూమిని ఇస్తానని సర్పంచ్‌గా ఎన్నికై న వ్యక్తి బాండ్‌పేపర్ రాసిచ్చారు. ఉప సర్పంచ్ అభ్యర్థి రూ.లక్ష ముందే డిపాజిట్ చేశారు. అంతే.. ఆ గిరిజన తండాలో ఒక్కో నామినేషన్ వేశారు.


