
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు
సిరిసిల్లకల్చరల్: వయోభారంతో బాధపడుతున్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తులు వెనక్కి తీసుకుని తిరిగి వృద్ధులకే అప్పగిస్తామని సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం తన కార్యాలయంలో పలువురి సీనియర్ సిటిజన్లకు సంబంధించి కేసులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పట్టణానికి చెందిన వెంగల జనార్ధన్ అనే వృద్ధుడు తనను అయినవాళ్లే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కొడుకు చంద్రశేఖర్, కోడలు పద్మ, కూతుళ్లు గజ్జెల్లి కమల, దిడ్డి లావణ్యపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారిని కార్యాలయానికి పిలిపించిన ఆర్డీవో కౌన్సెలింగ్ ఇచ్చారు. బతికినంత కాలం ఏ లోటు లేకుండా జనార్ధన్ బాగోగులు చూసుకుంటేనే ఆయన ఆస్తిపాస్తులు అనుభవించే యోగ్యత ఉంటుందని, లేకుంటే సదరు ఆస్తులన్నీ తిరిగి జనార్ధన్‌కే అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్డీవో సూచన మేరకు తండ్రిని బాగా చూసుకుంటామని కొడుకు, కోడలు హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్ల సంఘం బాధ్యులు డాక్టర్ జనపాల శంకరయ్య, దొంత దేవదాస్, కార్యాలయ ఉద్యోగులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.