రాజకీయ స్వార్థం కోసం విభజన వద్దు | - | Sakshi
Sakshi News home page

రాజకీయ స్వార్థం కోసం విభజన వద్దు

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీలో వార్డుల విభజన సక్రమంగా జరగలేదని, సమగ్ర విచారణ జరిపి రాజకీయ కోణంలో కాకుండా ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డుల పునర్విభజన చేయాలని వైఎస్సార్‌ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శుక్రవారం కలెక్టర్‌ ఎం.విజయసునీత, కమిషనర్‌ నారాయణరావును కలిసి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మార్కాపురం పట్టణంలో 35 వార్డులు ఉండగా 40 వార్డులకు పెంచారని, విభజన ప్రక్రియ అసంబద్ధంగా జరిగిందని తెలిపారు. మున్సిపల్‌ నిబంధనలు, 2025 జనాభా లెక్కల ప్రకారం విభజన చేయాలని, అలా కాకుండా కొంత మంది నాయకుల స్వార్థం కోసం, కొన్ని రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం విభజన చేశారని ప్రజలు తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు. విభజన ప్రక్రియలో డోర్‌ నంబర్లు, హద్దులు సరిగా లేవని, మ్యాప్‌లు కూడా రిలీజ్‌ చేయలేదని అన్నారు. 1 నుంచి 19 వార్డుల్లో ఒక వార్డును, 20 నుంచి 30 వార్డుల్లో ఒక వార్డును మాత్రమే పెంచి మిగిలిన 5 వార్డుల్లో 3 వార్డులను కొత్తగా ఏర్పాటు చేశారన్నారు. మున్సిపల్‌ నిబంధనలను ఏమాత్రం పాటించలేదన్నారు. శాశ్వత ప్రయోజనాలను, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డుల విభజన చేపట్టి ఉంటే బాగుండేదని అన్నారు. మళ్లీ రీ సర్వే చేయాలని కలెక్టర్‌, కమిషనర్‌ను కోరినట్టు అన్నా రాంబాబు వివరించారు. తమ అభ్యంతరాలను అధికారులు పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు సౌకర్యవంతంగా మళ్లీ విభజన చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇదే విషయంపై మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ మున్సిపల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో కూడా వినతిపత్రాన్ని అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి షంషేర్‌ ఆలీబేగ్‌, పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సలీమ్‌, సత్యంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు బట్టగిరి తిరుపతిరెడ్డి, ఆసీఫ్‌ఖాన్‌, నాలి కొండయ్య, సీహెచ్‌ శ్రీనివాసులు, బి.శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డులు విభజించాలి

ప్రస్తుతం వార్డుల విభజన సక్రమంగా జరగలేదు

కలెక్టర్‌, కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

Advertisement
 
Advertisement
Advertisement