
19న ‘ఛలో మెడికల్ కాలేజ్’ జయప్రదం చేయండి
ఒంగోలు సిటీ: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 19న మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో తలపెట్టిన ‘ఛలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 19వ తేదీన మార్కాపురం మెడికల్ కాలేజీ వద్దకు శాంతియుతంగా పెద్ద ఎత్తున తరలివెళ్లి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు, కార్తకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
సింగరాయకొండ: మండలంలోని పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు విజయానంద్ న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరుగుతున్న సమావేశాల్లో 100 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 89వ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ జనరల్ మీటింగ్, ఎగ్జిబిషన్‌లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు. పాఠశాల స్కూల్ అసిస్టెంట్, పాఠశాల స్టాండర్డ్ క్లబ్ మెంటార్ అయిన విజయానంద్‌కు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుంచి సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందినట్లు పేర్కొన్నారు.
ఒంగోలు టౌన్: జిల్లాలో 10 మెడికల్ షాపుల లైసెన్స్‌లను సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా డ్రగ్ కంట్రోల్ శాఖ లైసెన్సింగ్ అథారిటీ ఉత్తర్వుల మేరకు ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనిఖీల్లో కొనకనమిట్ల, దర్శి, పొదిలి, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలతో పాటుగా ఒంగోలులోని ఒక మెడికల్ షాపులో డ్రగ్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్–1940ను ఉల్లంఘించినట్లు నిర్ధారించినట్లు వివరించారు. ప్రజారోగ్యం, ఔషధ వినియోగంలో నిబంధనల పాటించకపోవడం, అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను విక్రయించడం వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఒంగోలు సిటీ: జిల్లాలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న యూటీఎఫ్ రణభేరి బైక్‌జాత ర్యాలీని జయప్రదం చేయాలని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ హై, వీరాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన ఆర్థిక, విద్యారంగ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు రణభేరి జాత నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా చేపట్టిన బైక్‌జాత ఈ నెల 18, 19 తేదీల్లో కనిగిరి నుంచి ప్రారంభమై గిద్దలూరు, బేస్తవారిపేట, మార్కాపురం, కొనకనమిట్ల, పొదిలి, దర్శి, తూర్పు గంగవరం, చీమకుర్తి, మీదుగా ఒంగోలుకు చేరుకుంటుందని తెలిపారు. జాతలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఒంగోలు మెట్రో: విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని విద్యుత్ కార్మికుల కార్యాచరణ జేఏసీ స్పష్టం చేసింది. విద్యుత్ కార్మికుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మూడో రోజు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అపరిమిత వైద్య సౌకర్యం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, సమాన పనికి సమాన వేతన, కాంట్రాక్టు సిబ్బందికి పీఆర్‌సీ అరియర్స్, జేఎల్‌ఎం గ్రేడ్–2లను రెగ్యులర్ చేయడం, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా జేఏసీ చైర్మన్ హరికృష్ణ, కన్వీనర్ వెంకటరవి, బెల్లంకొండ సురేష్, తేళ్ల అంజయ్య, రాఘవరెడ్డి, దుర్గాప్రసాద్, జబ్బర్, ఆనందరావు, రంగమన్నార్, వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.