
వివాదాల సుడిగుండం!
ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రతిష్ట దిగజారుతోంది. ప్రశాంతంగా ఉన్న కళాశాల వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కళాశాల ప్రారంభం రోజే క్యాంటీన్ నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ వివాదం మరువకముందే విద్యార్థులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించి 26 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. వెంటనే వారిని క్యాంపస్ నుంచి బలవంతంగా వెళ్లగొట్టడం సంచలనంగా మారింది. ఒక వైపు కళాశాల డైరెక్టర్ మెడికల్ లీవుపై వెళ్లడం, మరో వైపు ఫ్యాక్టల్టీల బదిలీల్లో వివాదాలతో కళాశాలను పట్టించుకునే వారే కరువవడంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గొడవల కేంద్రం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రశాంతంగా ఉన్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీ వివాదాలమయంగా మారుతోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రావ్ అండ్ నాయుడు క్యాంపస్ ఎత్తివేసినప్పటి నుంచి తరచూ ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ గొడవలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైరక్టర్ సెలవు మీద వెళ్లడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఏడాది కాలేజీ ప్రారంభమైన తొలిరోజే క్యాంటిన్ నిర్వాహకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరవై రోజులు కూడా గడిచాయో లేదో విద్యార్థులు కొట్టుకున్నారు. ఒకవైపు ఫ్యాకల్టీల బదిలీల్లో అక్రమాల వ్యవహారం సద్దుమణగలేదు. డైలీవేజెస్ సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండానే ఇంటికి పంపించి వేయడంపై అసంతృప్తి రాజుకుంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ పరువు రోడ్డున పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం రాత్రి సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య గొడవ జరగడం, వారిలో 26 మందిని సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
అధికారులకు ముందే తెలుసా...
వాస్తవానికి రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌లో ఉన్నప్పుడే కొందరు విద్యార్థుల మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అయితే రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌ను ఎత్తి వేసి ఇంజినీరింగ్ విద్యార్థులను ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్‌కు తరలించారు. విద్యార్థుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని తెలిసినప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఒకే బ్లాకులో సీనియర్లను, జూనియర్లను ఉంచడం గొడవలకు కారణమైందన్న విమర్శలు వస్తున్నాయి.
జూనియర్ విద్యార్థికి గాయాలు ...
విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక జూనియర్ విద్యార్థిపై క్రికెట్ స్టంప్స్‌తో దాడిచేసినట్టు తెలిసింది. ఈ దాడిలో ఆ విద్యార్థికి తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం అతనిని వైద్యశాలలో రహస్యంగా ఉంచి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.
స్టూడెంట్స్ వెల్ఫేర్ అధికారుల వైఫల్యం...
విద్యార్థుల మధ్య గొడవ జరగడంలో స్టూడెంట్ వెల్ఫేర్ విభాగానికి చెందిన కొందరు అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్, జూనియర్ విద్యార్థులను ఒకే బ్లాక్‌లో ఉంచడం, విద్యార్థుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని తెలిసినా ఎలాంటి కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం, విద్యార్థులు హాస్టల్ గదుల్లో క్రికెట్ బ్యాట్లు, స్టంప్స్, డంబెల్స్ దాచిపెట్టుకున్నప్పటికీ పసిగట్టలేకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నిజానికి ఈ గొడవలకు సంబంధించి 26 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు అయితే గొడవలను అరికట్టలేని సంబంధిత అధికారులపై చర్యలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి.
ఒకే బ్లాకులో సీనియర్లు, జూనియర్లు
ట్రిపుల్ ఐటీ కాలేజీలో గొడవలు జరగడంపై చర్చ జరుగుతోంది. ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్‌లో మొత్తం 8 బ్లాకులు ఉన్నాయి. వీటిని ఏ, బి, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్, ఐ, జే బ్లాకులుగా పిలుస్తుంటారు. వీటిలో ఏ, బీ, సీ, డీ బ్లాకుల్లో గర్‌ల్స్ హాస్టల్ ఉంది. ఈ, ఎఫ్, జీ బ్లాకుల్లో అకడమిక్ తరగతులు నిర్వహిస్తుంటారు. గోల్డెన్ బ్లాకులో పరిపాలనా శాఖ కార్యాలయం ఉంది. హెచ్, ఐ, జే బ్లాకుల్లో బాయ్స్ హాస్టల్ ఉంది. ఒక్కో బ్లాకులో ఒక్కో ఏడాది విద్యార్థులను ఉంచాలి. అయితే ఇందుకు భిన్నంగా ఐ బ్లాకులోని ఒక ఫ్లోర్‌లో సీనియర్లను, మరో ఫ్లోర్‌లో జూనియర్లను ఉంచారు. ఈ ఇద్దరినీ ఒకే బ్లాకులో ఉంచడమే ఈ గొడవలకు ప్రధాన కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యార్థుల సస్పెన్షన్‌పై సీరియస్...
విద్యార్థుల మధ్య జరిగిన కొట్లాటలకు సంబంధించి 26 మంది సీనియర్ విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే వారిని క్యాంపస్ నుంచి బలవంతంగా వెళ్లగొట్టారు. విద్యార్థులు ఎంతగా బతిమాలుకున్నా అధికారులు వినలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా సస్పెండ్ అయిన విద్యార్థుల్లో పశ్చిమ ప్రకాశంలోని ఒక మండల విద్యాధికారి సోదరి కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ పిల్లవాడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసి ఇంటికి పంపించడంతో ఆగ్రహానికి గురైన ఆయన శనివారం ట్రిపుల్ ఐటీ అధికారులకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. గొడవ జరుగుతున్నప్పుడు బయట ఉన్న విద్యార్థిని ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించినట్లుగా తెలిసింది. ఏ ప్రతిపాదిక మీద విద్యార్థులను సస్పెండ్ చేశారో చెప్పాలని నిలదీసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎలాంటి విచారణ నిర్వహించారు. ఏమని రిపోర్టు ఇచ్చారని అడిగినట్లు తెలుస్తోంది. కాలేజీలో రెండు గ్రూపుల మధ్య వివాదం జరిగితే ఒక గ్రూపు విద్యార్థులనే ఎలా సస్పెండ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు బెంబేలెత్తారు. సోమవారం కళాశాలకు రావాలని విద్యార్థులకు ఫోన్లు చేసినట్టు సమాచారం.
మసకబారుతున్న ట్రిపుల్ ఐటీ ప్రతిష్ట క్యాంపస్‌లో తరచుగా గొడవలు మొన్న క్యాంటిన్ నిర్వాహకుల మధ్య ఫైటింగ్ నిన్న విద్యార్థుల మధ్య గ్రూప్ వార్ హాస్టల్ గదుల్లో క్రికెట్ బ్యాట్లు, స్టంపులు, డంబెల్స్ ఒకే బ్లాక్‌లో సీనియర్లు, జూనియర్లు ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు గత ఐదేళ్లూ ప్రశాంతంగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు
హాస్టల్ గదుల్లో క్రికెట్ బ్యాట్లు
సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవల్లో క్రికెట్ బ్యాట్లు, స్టంపులు వినియోగించినట్టు సమాచారం. ఈ గొడవ తరువాత జరిగిన తనిఖీల్లో హాస్టల్ గదుల్లో పదుల సంఖ్యలో క్రికెట్ బ్యాట్లు, స్టంపులు, డంబెల్స్ దొరికినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం హాస్టల్ గదుల్లో ఎలాంటి క్రీడా పరికరాలు ఉండకూడదు. అసలు క్రికెట్ బ్యాట్లు, స్టంపులు, డంబెల్స్ విద్యార్థుల గదుల్లోకి ఎలా వచ్చాయో అధికారులే చెప్పాలి. నిజానికి క్యాంపస్‌లో పీఈటీ విభాగానికి సంబంధించిన గది ఉంది. తరగతులు అయిపోయాక క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు తమకు నచ్చిన ఆటలు ఆడుకునే సౌకర్యం ఉంది. ఇక్కడ క్యారంబోర్డు, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, చెస్, క్రికెట్ పరికరాలు ఉంటాయి. వీటిని తీసుకెళ్లి ఆడుకొన్న తరువాత వాటిని పీఈటీకి అప్పగించాల్సి ఉంది. అలాంటిది విద్యార్థుల గదుల్లో ఈ క్రికెట్ బ్యాట్లు, స్టంప్స్ ఎలా వచ్చా యన్నది తెలియాల్సి ఉంది. వీటిని గుట్టుచప్పుడు కాకుండా ఏవో కార్యాలయానికి తరలించారు.

వివాదాల సుడిగుండం!