
కుటుంబ కలహాలతో పంట ధ్వంసం
పెద్దదోర్నాల: కుటుంబ కలహాలతో ఓ మహిళా రైతు వేసిన పత్తి పంటను కన్న కూతుర్లే ధ్వంసం చేసిన సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరులో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. ఈ సంఘటనతో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితురాలు వాపోయింది. బాధితురాలి కథనం మేరకు.. కొత్తూరుకు చెందిన రైతు యేరువ శ్రీనివాసరెడ్డి గతంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి ఆయన భార్య చిన్నక్క అన్నీ తానై తన ముగ్గురు కుమార్తెలను పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. వారికి ఇవ్వాల్సిన లాంఛనాలు అన్నీ ఇచ్చి వారిని అత్తారిళ్లకు పంపారు. కూతుళ్లకు ఇచ్చింది పోగా, గ్రామంలో మిగిలిన రెండు ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తమ కుటుంబంలో ఆస్తి విషయమై తనకు, తన కూతుళ్లకు మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఆస్తిని పంచి తమ వాటా తమకు రాసివ్వాలని కుమార్తెలు గొడవలు పడుతున్నారని చిన్నక్క ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తనతో గొడవ పెట్టుకున్న తన ఇద్దరు కుమార్తెలు వారి భర్తలతో కలిసి గ్రామంలో సాగు చేస్తున్న రెండెకరాల పత్తి పంటను మొదళ్లతో సహా పీకేసి ధ్వంసం చేసినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. కడుపున పుట్టిన వాళ్లే తల్లిపై కసిని పెంచుకుని, చివరకు ఇలా నష్టాన్ని మిగిల్చారని ఆమె రోదిస్తోంది.
కడుపున పుట్టిన బిడ్డలే శత్రువులుగా మారిన వైనం
పత్తి పంటను ధ్వంసం చేసిన కుమార్తెలు