
కడ‘గండ్ల’కు కారుకులెవరు?
సాగుకు సంకటం..
పునుగోడు రిజర్వాయర్
కనిగిరి రూరల్:
పంట భూములకు సాగు నీరందించి, భూగర్భ జలాల మట్టాన్ని పెంచే రిజర్వాయర్లు, చెరువుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పాలకుల నిర్లక్ష్యం మూలంగా రిజర్వాయర్లలో, చెరువుల్లో నీరు నిలిచే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నిర్వహించిన మండల పరిషత్ సమావేశాల్లో సైతం చెరువుల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానం కరువైంది. కనిగిరి ప్రాంతంలోని ప్రధాన చెరువులకు ఏర్పడిన గండ్ల వెనుక చేపల కాంట్రాక్టర్ల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కనిగిరి నియోజకవర్గంలో 100 ఎకరాల ఆయకట్టు ఉన్న మైనర్ చెరువులు 53, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన మోపాడు రిజర్వాయర్ ఉన్నాయి. కనిగిరి మండలంలో పునుగోడు, ఎన్‌గొల్లపల్లి రిజర్వాయర్‌లతోకలిపి 13 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా... 100 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 30 వరకు ఉన్నట్లు నివేదికలున్నాయి. ఇక 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులు పామూరులో 7, హెచ్‌ఎంపాడులో 3, వెలిగండ్లలో 8, పీసీపల్లిలో 10, సీఎస్‌పురంలో 12 వరకు ఉన్నాయి.
దెబ్బతిన్న తూములు, షట్టర్లు
కనిగిరి నియోజకవర్గంలో మోపాడు రిజర్వాయర్ కింద 12 వేల ఎకరాల ఆయకట్టు, నేలటూరి గొల్లపల్లి మైనర్ రిజర్వాయర్ కింద 2,500 ఎకరాల ఆయకట్టు, పునుగోడు రిజర్వాయర్ కింద 2 వేల ఎకరాల ఆయకట్టు, పందువ గండి రిజర్వాయర్ కింద వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టు భూములు ఉన్నాయి. నేలటూరి గొల్లపల్లి రిజర్వాయర్ కట్ట, తూము, షట్టర్లు, కాలువలు పూర్తిగా అవసాన దశకు చేరాయి. భారీ వర్షం పడితే లీకుల నుంచి ఉధృతంగా నీరు ప్రవహించకుండా ఇసుక బస్తాలు వేసి మమ అనిపించారు. రిజర్వాయర్ రెండు ప్రధాన కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పునుగోడు రిజర్వాయర్ షట్టర్ తుప్పు పట్టి విరిగిపోయింది. రిజర్వాయర్ కట్టకు రంధ్రాలు పడటంతోపాటు చెట్లు మొలిచాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి గోడలు నెర్రెలిచ్చాయి. మోపాడు రిజర్వాయర్‌కు గతంలో 5 చోట్ల నీరు ఊటరాగా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టలేదు. కలగట్ల, జమ్మలమడక చెరువు కట్టలు దెబ్బతిన్నా నేటికీ పట్టించుకున్న దిక్కులేదు.
● బలహీనంగా మారిన పామూరు పాత చెరువు కట్ట బలోపేతానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. పామూరు కొత్త చెరువు కట్ట సైతం బలహీనంగా మారింది. 2023లో వర్షాలకు చెరువు నీరు కట్టపైకి చేరగా తాత్కాలికంగా బలోపేతం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టలేదు. వగ్గంపల్లె చెరువు అలుగువద్ద కట్ట దెబ్బతినగా మరమ్మతుల సంగతే మరిచారు.
● హనుమంతునిపాడు మండలంలో హాజీపురం, నందనవనం, తిమ్మారెడ్డిపల్లి, మిట్టపాలెం, వీరరాంపురం, వాలిచర్ల చెరువులు మరమ్మతులకు గురయ్యాయి. హాజీపురం, దొడ్డి చింతల చెరువుల కింద 1,250 ఎకరాల ఆయకట్టు ఉంది. పదేళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోలేదు. కట్టపై చిల్ల చెట్లు మొలవడంతోపాటు రాతి కతువ సైతం దెబ్బతింది. చెరువు కాలువలు మరమ్మతులకు గురయ్యాయి.
● పీసీపల్లి మండలంలోని 15 మైనర్ ఇరిగేషన్ చెరువులు చిల్లచెట్లతో నిండిపోయాయి. తూముల వద్ద లీకులతో నీరు నిలబడే పరిస్థితి లేదు. గతంలో మారెళ్ల చెరువు వర్షానికి నిండినా తూములకు లీకులు ఏర్పడి నీరంతా వృథాగా పోయాయి.
చేపల కోసమే గండ్లు?
మోపాడు రిజర్వాయర్‌లో చేపలు పట్టుకోవడం కోసం అందులోని నీటిని బయటకు పంపేందుకు కొద్ది నెలల క్రితం కాంట్రాక్టర్లు జేసీబీతో అలుగు వాగుకు గండి కొట్టారు. దీనిపై ఆగ్రహించిన ఆయకట్టు రైతులు, వామపక్షాలు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చకు దారితీసింది. అలాగే పునుగోడు రిజర్వాయర్‌లో చేపల కోసం నీటిని బయటకు పంపేందుకు కాంట్రాక్టర్లు రహస్యంగా రంధ్రాలు వేశారన్న ఆరోపణలున్నాయి. ఇరిగేషన్ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని, పురాతన కాలం నాటి గోడలు కావడంతో చెట్ల వేర్ల వల్ల రంధ్రాలు పడుతున్నాయని చెబుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం
పునుగోడు, నేలటూరి గొలపల్లి షట్టర్లు, తూములు దెబ్బతిన్నది వాస్తవమే. కలగట్ల చెరువు కట్టకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఎన్.గొల్లపల్లి రిజర్వాయర్ మరమ్మతులకు రూ.46 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. పునుగోడు రిజర్వాయర్ షట్టర్‌కు రూ.3 లక్షలతో కొద్దిరోజుల్లోనే మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 30 చెరువుల మరమ్మతులకు రూ.12.70 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. చేపల వేట కోసం నీళ్లను బయటకు పంపించేందుకు గండ్లు కొట్టారన్న ప్రచారంలో వాస్తవం లేదు.
– మధుబాబు, ఇరిగేషన్ జేఈ

కడ‘గండ్ల’కు కారుకులెవరు?