
ఈదుమూడిలో అగ్ని ప్రమాదం
నాగులుప్పలపాడు: షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని ఈదుమూడిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన కృష్ణమూర్తి పెంకుడు ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో రూ.50 వేల నగదు, ద్విచక్రవాహనం, ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమమయ్యాయి. అగ్నిప్రమాదంతో కట్టుబట్టలతో మిగిలామని బాధితులు వాపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో వాళ్లంతా తాళం వేసి గుడికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ప్రమాదం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పంటలను అదుపు చేశారు.
రూ.1.10 లక్షల నగదు చోరీ
సింగరాయకొండ: ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడి రూ.1.10 లక్షల నగదు, వెండి పట్టీలు చోరీ చేశారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున మండల కేంద్రంలోని ప్రశాంతి థియేటర్ ఎదురు సందులో నివాసం ఉంటున్న పఠాన్ రఫీఖాన్ నివాసంలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం..రఫీఖాన్ ఈతముక్కలలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. మొహర్రం పండుగను పురస్కరించుకొని భార్య, పిల్లలు ఈతముక్కలలోని బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.1.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
నేటి నుంచి డిగ్రీ రెండో సెమిస్టర్ మూల్యాంకనం
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం డిగ్రీ రెండో సెమిస్టర్ మూల్యాంకనం ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్ డాక్టర్ డి.కళ్యాణి తెలిపారు. మూల్యాంకనానికి ఎంపిక చేసిన అధ్యాపకులు యూనివర్శిటీ ఐడీ కార్డులు, తమ కాలేజీ ప్రిన్సిపాల్ లేఖతో కళాశాలలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. అధ్యాపకులను తక్షణమే రిలీవ్ చేయాలని ప్రిన్సిపాళ్లను క్యాంప్ ఆఫీసర్ గురువారం ఓ ప్రకటనలో కోరారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
ఒకరికి 40 రోజుల జైలు
రాచర్ల: మద్యం మత్తులో లారీ నడుపుతూ పట్టుబడిన ఒక వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. రాచర్ల మండల పరిధిలో హైవేపై ఈ నెల 9న డ్రంక్ అండ్ పరీక్షలు చేస్తుండగా ఒంగోలు మండలం త్రోవగుంట గ్రామానికి చెందిన పట్టిం వెంకటరావు పట్టుబడ్డాడు. నిందితుడిని గురువారం గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి కె.భరత్‌చంద్ర 40 రోజులు జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరియానా విధించారని, ఆరు నెలలపాటు లైసెన్స్ రద్దు చేశారని ఎస్సై వివరించారు.
కరేడు రైతుల కోసం పోరాడతాం..
ఉలవపాడు: కరేడు రైతుల కోసం ఎంతవరకు పోరాడేందుకై నా సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గురువారం కరేడులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ రైతులు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, వారు రాస్తారోఖో చేసిన రోజే వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాలు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాయన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కార్పొరేట్‌ల పక్షమా.. లేక ప్రజల పక్షమా తేల్చుకోవాలన్నారు. ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ తప్పుడు సమాచారం మీడియాకు చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి పనులు చేయడం మంచిది కాదన్నారు. ప్రజలతో మాట్లాడకుండా బయట ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఓట్లు వేసిన రైతులకు మేలు చేస్తాడా.. లేక కంపెనీలకు మేలు చేస్తాడా.. అనేది నిర్ణయించుకోవాలన్నారు. భూములు లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు పేర్కొంటున్నారని గుర్తు చేశారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, అవసరం అనుకుంటే మనమే ఒక హత్య చేద్దామని అన్నారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూడా మాట్లాడతానని, రైతుల సమస్యలు తెలియజేస్తానన్నారు. రైతుల సమస్యల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ఏకం చేస్తామన్నారు. రైతులు అమరావతి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తొలుత భూములు వద్ద రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేవీవీ ప్రసాద్, సీపీఐ ప్రకాశం, నెల్లూరు జిల్లాల కార్యదర్శులు నారాయణ, దామా అంకయ్య, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమారెడ్డి, కరేడు రైతు ఉద్యమ నాయకులు మిరియం శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈదుమూడిలో అగ్ని ప్రమాదం