
మా భూములు ఆన్‌లైన్ చేస్తారా లేదా?
కొత్తపట్నం: తమ భూములను ఆన్‌లైన్ చేయకుండా రెవెన్యూ, రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ 20 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని అడ్డుకుని నిలదీశారు. వివరాలు.. కొత్తపట్నం మండలంలో కె.పల్లెపాలెం రెవెన్యూ సర్వే నంబర్ 1680లో 119.40 ఎకరాల భూమిని సుమారు 70 ఏళ్ల నుంచి రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రయ విక్రయాలు కూడా జరిగాయి. అయితే భూముల ఆన్‌లైన్ ప్రక్రియ అమల్లోకి వచ్చాక రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌లో భూమి చూపించడం లేదన్న కారణంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అది రిజర్వ్ ఫారెస్ట్ భూమి తామేమీ చేయలేమంటూ రెవవెన్యూ అధికారులు చేతులెత్తేశారు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు మాత్రం అది తమ భూమి కాదంటున్నారు. సుమారు 20 ఏళ్లుగా ఈ రెండు శాఖల అధికారుల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఓపిక నశించిన రైతులు ఇటీవల గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చారు. దీంతో ఆర్డీఓ లక్ష్మీప్రసన్న గురువారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు సరైన సమాచారం తీసుకురాకపోవడంతో ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, భూముల డాక్యుమెంట్లు, భూముల్లో సాగు చేసిన పంటలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రికార్డులు తనఖీ చేసి, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ఆర్డీఓ చెప్పారు.