
మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరం
ఒంగోలు: కక్షిదారులు మధ్యవర్తిత్వంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించే ర్యాలీని గురువారం జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం నుంచి బయల్దేరిన ర్యాలీ సీవీఎన్ రీడింగ్ రూం సెంటర్, కేశవస్వామిపేట జంక్షన్, నగరపాలక సంస్థ కార్యాలయం మీదుగా చర్చిసెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొని 1కే రన్‌ను జయప్రదం చేశారు. అనంతరం చర్చిసెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై కక్షిదారులకు, సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన మీడియేషన్ టు నేషన్ స్టాల్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. 7వ అదనపు జిల్లా జడ్జి టి.రాజా వెంకటాద్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 59 మంది మీడియేటర్లను నియమించామన్నారు. వీరి ద్వారా వివిద స్థాయిల్లో ఉన్న వ్యాజ్యాలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ర్యాలీలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, ఎ.పూర్ణిమ, పి.లలిత, జి.దీన, కె.శైలజ, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు ఎస్.హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, ఒంగోలు బార్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, ఒంగోలు నగర డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి