
పేరెంట్స్ సమావేశం కాదు.. టీడీపీ సంబరాలు..!
యర్రగొండపాలెం: ప్రభుత్వం పాఠశాలల్లో అట్టహాసంగా నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం కాస్తా టీడీపీ సంబరాలుగా మారాయి. ఈ సమావేశాల్లో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణ, ఆయా పాఠశాలల్లో ఉన్న సమస్యలపై చర్చించడం లాంటివి జరగాల్సి ఉంది. అందుకు భిన్నంగా టీడీపీ నాయకులు సమావేశాల్లో పాల్గొని ఊకదంపుడు ప్రసంగాాలతో ముగించారు. ఈ సమావేశాల్లో పేరెంట్స్ కేవలం 40 శాతం మంది మాత్రమే పాల్గొన్నారు. గణపవరం గురుకుల పాఠశాలలో సమావేశం ప్రారంభం కాకముందే ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌తో ఎస్‌ఎంసీ చైర్మన్ వాదనకు దిగారు. పేరెంట్స్–టీచర్స్ సమావేశం జరుగుతుందని తమకు సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. పెద్దదోర్నాల కేజీబీవీ కళాశాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు కళాశాల ప్రాంగణంలోకి చేరుతున్న మురుగునీరు, కోతుల బెడదపై ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో మురుగునీటి నిల్వలతో తమ పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని, కోతులు కళాశాలలో ఎక్కువగా ఉంటున్నాయని, దుస్తులు శుభ్రం చేసుకుని ఆరబెట్టుకునే సమయంలో అవి తమ పిల్లలపై ఎక్కడ దాడి చేస్తాయోనని ఆందోళనగా ఉందని అన్నారు. యర్రగొండపాలెం, పుల్లలచెరువు పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో ఎటువంటి అర్హతలేని పచ్చనేతలు పాల్గొన్నారు. సమస్యలపై చర్చించేందుకు వెళ్లిన తల్లిదండ్రులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.