ఎస్‌ఎంసీ చైర్మన్‌ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంసీ చైర్మన్‌ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం

Jul 10 2025 6:59 AM | Updated on Jul 10 2025 6:59 AM

ఎస్‌ఎంసీ చైర్మన్‌ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం

ఎస్‌ఎంసీ చైర్మన్‌ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం

యర్రగొండపాలెం: స్కూల్‌ మానిటరింగ్‌ కమిటీ(ఎస్‌ఎంసీ) చైర్మన్‌ అరాచకాలను తట్టుకోలేకపోతున్నామని, తమను మురికిమల్ల గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి ఎక్కడికై నా డిప్యుటేషన్‌పై బదిలీ చేయాలని కోరుతూ బుధవారం ఆ పాఠశాల హెచ్‌ఎం, పలువురు ఉపాధ్యాయులు డీటీడబ్ల్యూఓ వరలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. పుల్లలచెరువు మండలంలోని మాచర్ల హైవే రోడ్డుపై ఉన్న మురికిమల్ల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్‌ బయ్యన్నతోపాటు మరో ఐదుగురు ఉపాధ్యాయులు మూకుమ్మడిగా సెలవుపెట్టి ఒంగోలు వెళ్లారు. అక్కడ డీటీడబ్ల్యూవో కార్యాలయంలో తమ గోడును లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ అనుమతి లేకుండా తాము పాఠశాలలోకి వెళ్లేందుకు వీలులేదని, రోజూ రోడ్డుపై నిల్చుని నమస్కారం చేసి పాఠశాలలోకి వెళ్లాలని చెబుతున్నాడని, ఆయన అనుమతి లేకుండా న్యూఅడ్మిషన్స్‌ చేర్చుకోవద్దని హుకుం జారీ చేస్తున్నాడని వినతి పత్రంలో ఉపాధ్యాయులు ఆరోపించారు. తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా పాఠశాలలోకి వచ్చి ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడని, క్లాస్‌ రూంలోకి వెళ్లి టీచర్‌ను బయటికి పంపి తానే క్లాస్‌ తీసుకుంటాడని, విద్యార్థుల ఎదుట హెచ్‌ఎంను, ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడుతున్నాడని డీటీడబ్ల్యూఓ దృష్టికి తీసుకెళ్లారు. వర్కర్స్‌ను బెదిరించి స్టోర్‌ రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న నిత్యావసర సరుకులను తీసుకెళ్తుంటాడని, స్కూల్లో ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటే టీచర్స్‌ అందరూ కలిసి ఆయన ఇంటి వద్దకు వెళ్లి పిలవాలని హుకుం జారీ చేస్తున్నాడని, పాల్‌–లాబ్‌కు సంబంధించి రూ.22,500 అకౌంట్‌లో పడితే వాటిని డ్రా చేసి తనకు ఇవ్వమంటున్నాడని అర్జీలో పేర్కొన్నారు. సాధారణ బదిలీలపై ఉపాధ్యాయులు వెళ్లిపోతే వారికి తానే బదిలీ చేయించానని ప్రచారం చేస్తున్నాడని, ఎస్‌ఎంసీ చైర్మన్‌కు స్కూల్లో ప్రత్యేకంగా ఒక చాంబర్‌ ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీఇది నా స్కూల్‌, నాకు తెలియకుండా ఏ పని చేయకూడదశ్రీని ఆదేశాలిస్తున్నాడని, జిల్లా, మండల స్థాయి అధికారులు, ఫారెస్ట్‌ అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను కూడా ఆయన అనుమతి లేకుండా రానివ్వవద్దంటూ నిప్పులు చెరుగుతున్నాడని వినతి పత్రంలో పేర్కొన్నారు. గత జనవరిలో గిరిజన బాలికలను అరకులో చలి ఉత్సవాలకు తీసుకెళ్లాలని కలెక్టర్‌ ఆదేశించారని, ఆ ఉత్సవాలకు వెళ్లే బాలికలతోపాటు తాను కూడా వస్తానని, లేదంటే తనకు ప్రత్యేకంగా కారు కేటాయించి తీసుకెళ్లాలని ఒత్తిడి చేశాడని, అందుకు తాము అనుమతించలేదని డీటీడబ్ల్యూఓకు వివరించారు. బయట గ్రామాల్లో ఆయన కనిపిస్తే నమస్కారం చేసి, బిర్యానీ పెట్టించి, ఖర్చులకు డబ్బు ఇవ్వాలని అడుగుతున్నాడని టీచర్లు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ అరాచకాలను తాము తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, వెంటనే తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని వేడుకున్నారు.

మురికిమల్ల ఆశ్రమ పాఠశాల నుంచి బదిలీ చేయండి

మూకుమ్మడిగా సెలవు పెట్టిన హెచ్‌ఎం,

ఐదుగురు టీచర్లు

డీటీడబ్ల్యూఓ వరలక్ష్మికి వినతి పత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement