
మధ్యవర్తిత్వంతో మెరుగైన పరిష్కారం
ఒంగోలు: న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం అనేది భవిష్యత్తు రోజుల్లో కక్షిదారుల సమస్యలను మరింత మెరుగ్గా పరిష్కరించనుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.భారతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా న్యాయస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం అనేది సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వేదికని అన్నారు. ఈ కార్యక్రమంపై ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. మీడియేషన్‌కు సంబంధించి శిక్షణ ముగించిన న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల సేవా ప్రతినిధులు వారికి అప్పగించిన మీడియేషన్ వ్యాజ్యాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మీడియేషన్‌పై స్థానిక న్యాయవాదులకు శిక్షణ ఇచ్చిన న్యాయవాది ఎస్.అరుణాచలంను అభినందించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, పి.లలిత, పూర్ణిమ, జి.దీన, టి.రాజా వెంకటాద్రి, సీనియర్ న్యాయమూర్తులు ఎస్.హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, జూనియర్ న్యాయమూర్తులు, ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు కిలోమీటరు నడక
మధ్యవర్తిత్వ అంశాన్ని కక్షిదారుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో భాగంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ గురువారం చేపట్టిన కిలోమీటరు నడక కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొనాలని ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 8.50 గంటలకు జిల్లా న్యాయస్థానం నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు.
మూలికా వైద్య సంఘ జాతీయ
అధ్యక్షుడిగా ఇమాంసాహేబ్
మార్కాపురం టౌన్: వంశపారంపర్య మూలికా వైద్య సంఘ జాతీయ అధ్యక్షుడిగా మార్కాపురం పట్టణానికి చెందిన మూలికా వైద్యుడు షేక్ ఇమాంసాహేబ్ ఎన్నికయ్యారు. రావులపాలెంలో నిర్వహించిన ఆయుర్వేద మూలికా వైద్యుల సమావేశంలో తనతోపాటు కార్యదర్శులుగా రామకృష్ణారెడ్డి, శంకర్, సహాయ కార్యదర్శిగా రాజు, మరికొందరు సభ్యులను ఎన్నుకున్నారయని ఆయన వివరించారు.

మధ్యవర్తిత్వంతో మెరుగైన పరిష్కారం