
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన
ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బుధవారం సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లోని యూనియన్ బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ నుంచి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా ప్రకాశం భవనం వద్ద కార్మిక సంఘాల ధర్నాలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పి. సుబ్బారావు, కె.రాజీవ్ రతన్‌దే్ , పి.రామయ్య, ఉమాశంకర్, హాసన్, బ్రహ్మానాయుడు, దుర్గాప్రసాద్, గాయత్రి తదితరులు నాయకత్వం వహించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగ నాయకులు పీకే రాజేశ్వరరావు, వి.పార్ధసారధి, సీబీ రావు, బ్రహ్మయ్య తదితరులు వారి సమ్మెకు సంఘీభావం తెలిపారు.
విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
పుల్లలచెరువు: విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొండారెడ్డి కొష్టాలు గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మునగాల శేషరెడ్డి(65) అనే రైతు చౌటపాచర్ల గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ట్రాన్స్‌పార్మర్ తీగలు తగిలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంతప్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య సీతారావమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా పాలన
బ్యాంకు ఉద్యోగుల ధర్నాలో యూనియన్ నాయకుల ధ్వజం