
13న ఉచిత మెగా వైద్య కంటి శిబిరం
చీమకుర్తి: బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 13న చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. చీమకుర్తిలోని బూచేపల్లి కమలాకర్‌రెడ్డి పార్కులో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుంచి సినీ హీరో బూచేపల్లి కమలాకర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శంకర కంటి ఆస్పత్రి వారి సహకారంతో కంటి వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు శంకర కంటి ఆస్పత్రి వైద్యులతో నిర్వహించే వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. హాజరైన రోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందిస్తారన్నారు. కంటి ఆపరేషన్‌లు చేయాల్సి వస్తే శంకర కంటి ఆస్పత్రికి బస్సుల్లోఉచితంగా తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి తిరిగి చీమకుర్తిలో వదిలిపెడతారని తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొనే రోగులందరికీ మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని కూడా బూచేపల్లి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొలుత ఉచిత మెగా కంటి వైద్య శిబిర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎన్.మాణిక్యం, కౌన్సిలర్‌లు బీమన వెంకట్రావు, సోమా శేషాద్రి, పాటిబండ్ల గంగయ్య, ఖాజా, గోపురపు చంద్ర, మేకల యల్లయ్య, బడే అయ్యపరెడ్డి, తెల్లమేకల గాంధీ, చీదర్ల శేషు, కుంచాల రాంబాబు, షేక్ ఖాదర్‌బాషా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
బూచేపల్లి ట్రస్టు, శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో
సినీ హీరో బూచేపల్లి కమలాకర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా..