
నీటి కుంటలో పడి యువకుడు మృతి
కురిచేడు: ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన కురిచేడు మండలంలోని అలవలపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రావి పెద్దకోటయ్య పొలం వద్ద ఉద్యానవనశాఖ నీటి కుంట నిర్మించింది. దాని కొలతల కోసం ఉద్యానశాఖ సిబ్బంది వచ్చారని, తోడుగా రమ్మని కొరివి రోశయ్య(30)ను పెద కోటయ్య తన వెంట తీసుకెళ్లాడు. కుంట కొలతలు తీసేందుకు గట్టుపై మెట్లు చెక్కాలని రోశయ్యను కోరాడు. పనిచేస్తున్న క్రమంలో అలసట తీర్చుకునేందుకు రోశయ్య కట్టపై ఉన్న వేప చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ఏమైందో తెలియదు నీటి కుంటలో పడిపోయాడు. రైతుతోపాటు ఉద్యాన సిబ్బంది నీటి కుంటలో దిగి వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వీఆర్వో రమాదేవి సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీతో కుంట కట్టకు గండి కొట్టించి నీటిని బయటకు పంపారు. రోశయ్య అప్పటికే మృతి చెందగా మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని భార్య గంగాభవాని ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో ఒక అబ్బాయి దివ్యాంగుడు. సంఘటనా స్థలానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
ఉద్యానవనశాఖ సిబ్బంది కొలతల
సందర్భంలో ఘటన

నీటి కుంటలో పడి యువకుడు మృతి