హర హరా.. చెన్నకేశవా.. | Sakshi
Sakshi News home page

హర హరా.. చెన్నకేశవా..

Published Wed, May 22 2024 10:30 AM

హర హరా.. చెన్నకేశవా..

హనుమంతునిపాడు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చిన్నగొల్లపల్లి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్ల అంగరంగ వైభవంగా సాగుతోంది. నాగులేటి ఒడ్డున కొలువై ఉన్న శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ వార్షిక తిరునాళ్లలో భాగంగా మంగళవారం గరుడ సేవ, పొంగళ్ల సమర్పణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆచార సంప్రదాయాల ప్రకారం స్వామి వారికి అర్చకులు, పాలెగాళ్లు దండకాలు చదివి ప్రత్యేక పూజలు చేశారు. కొన తాళ్లను పూజించి పోతురాజుకు పట్టాలు వేసిన అనంతరం మేకపోతు గావు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. చెక్కా వంశస్తులు పొంగళి బోనాలతో, గోవింద నామాన్ని ఉచ్చరిస్తూ పోతురాజుల వీర కేకల నడుమ ఖడ్గ సేవలో పాల్గొన్నారు. నీలకంఠాపురం, రంగంపేట పాలెగాళ్లు భక్తిశ్రద్ధలతో ఖడ్గ సేవ చేశారు. స్వామివారికి పూజలు నిర్వహించి అంకాలమ్మ తల్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, మార్కాపురం, చీరాల, కావలి, నెల్లూరు, హైదరాబాద్‌లో స్థిరపడిన చెక్కా కుటుంబీకులు, అలాగే మధ్యప్రదేశ్‌, న్యూఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్‌, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో స్థిరపడిన కనిగిరి ప్రాంత భక్తులు భారీ సంఖ్యలో తిరునాళ్లకు హాజరయ్యారు. తమ ఇష్ట దైవం చెన్నకేశవస్వామికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరునాళ్లలో బుధవారం మోహినీ ఉత్సవం, ఖడ్గ సేవ, మేకపోతు గావుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, గురువారం సాయంత్రం కంపకళ్లి నిర్వహించనున్నారు.

హెచ్‌ఎంపాడు మండలం

చిన్నగొల్లపల్లిలో భక్తిపారవశ్యం

శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్లలో భాగంగా వైభవంగా గరుడ సేవ

పాలెగాళ్ల ఖడ్గ సేవ, పోతురాజు గావును ఆసక్తిగా తిలకించిన భక్తులు

Advertisement
 
Advertisement
 
Advertisement