చెంచుగిరిజనుల ఆర్థికాభివృద్ధికి కృషి

మాట్లాడుతున్న ఎస్టీ కమీషన్‌ రాష్ట్ర చైర్మన్‌ శంకరరావు - Sakshi

పెద్దదోర్నాల: చెంచు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం పాటు పడుతున్నారని ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డీవీజీ శంకరరావు అన్నారు. మండల పరిధిలోని నల్లమల అభయారణ్యంలోని లోతట్టు అటవీ ప్రాంతమైన మర్రిపాలెం, ఇష్టకామేశ్వరి ఆలయాలతో పాటు బయ్యన్నసెల, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో ఆదివారం ఎస్టీ కమిషన్‌ సభ్యులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మర్రిపాలెంలో పర్యటించిన ఆయన చెంచు గిరిజనులతో మాట్లాడుతూ ఆదివాసీలు అనాదిగా అటవీ సంపదను కాపాడే అటవీ తల్లి ముద్దుబిడ్డలని కొనియాడారు. ఆదివాసీలు ఎప్పుడు చదువుకు పెద్దపీట వేస్తారో అప్పుడే అభివృద్ధి వారి వెంట ఉంటుందన్నారు. పనులు కాస్త మందకొడిగా జరిగినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. వనాలు, వన్యప్రాణులను అనునిత్యం కాపాడుతూ అటవీ సంరక్షణకు నిరంతర పాటుపడుతున్న చెంచు గిరిజనులు అభినందనీయులన్నారు. ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. చెంచు గిరిజనుల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం ఎన్నో అంశాలకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ఆరోగ్యం, విద్య, ఉపాధిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. చిన్న రోగాలకే ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనుల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు. గతంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న గిరిజనుల కోసం మండల కేంద్రం పెద్దదోర్నాలలో సుమారు రూ.50 కోట్లతో గిరిజన సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలను, మార్కాపురంలో మెడికల్‌ కళాశాలతో పాటు యర్రగొండపాలెంలో రూ.26 కోట్లతో 100 పడకల వైద్యశాల, మండల కేంద్రంలో రూ.3 కోట్లతో మాతా శిశు అరోగ్యకేంద్రాలను నిర్మించారన్నారు. దీని వల్ల నల్లమల పరిధిలోని చెంచు గిరిజనులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి అటవీహక్కుల చట్టం ఏర్పాటు చేసి గిరిజనులు సాగు చేసుకునే భూములపై వారికే హక్కు కల్పించారన్నారు. అప్పటి నుంచి ఐటీడీఏ శ్రీశైలం పరిధిలోని ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలో ఎన్నో వేల మంది చెంచు రైతులకు అటవీ భూమిని పంపిణీ చేశామని తెలిపారు. మర్రిపాలెంలో సుమారు 600 ఎకరాల భూములు అటవీ హక్కుల చట్టంతో చెంచు గిరిజనులకు స్వంతమయ్యాయన్నారు. బాగా వెనుకబడ్డ ప్రాంతాల్లో ఆర్వోఎఫ్‌ ఆర్‌ పట్టాలు సక్రమంగా అందాయన్నారు. గతంలోనే అడవుల్లో నివసిస్తున్న చెంచు కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సభ్యులకు చెంచు గిరిజనులు సాంప్రదాయ నృత్యాలు డప్పుల కోలాహలంతో స్వాగతం పలికారు. చెంచు గిరిజనుల ఆర్యాద దేవతలకు చైర్మన్‌, సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి, ఎస్టీ కమిషన్‌ సభ్యులు వడిత్యా సోమసుందర్‌ నాయక్‌, మత్స్యకార విశ్వేశ్వరాజు, కొర్ర రాము, జంపరంగిలిల్లీ, బిచ్చడి మురళి, అధికారులు పాల్గొన్నారు.

గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపేందుకే ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములు

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డీవీజీ శంకర్‌రావు

అభయారణ్యంలోని లోతట్టు

ప్రాంతాల్లో పర్యటన

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top