చెన్నకేశవస్వామి తెప్పోత్సవానికి భారీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

చెన్నకేశవస్వామి తెప్పోత్సవానికి భారీ ఏర్పాట్లు

Published Wed, Nov 22 2023 12:22 AM

కోనేరును పరిశీలిస్తున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి  - Sakshi

అన్ని శాఖల అధికారులు సహకరించాలి

ఈఓ శ్రీనివాసరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఏఓ బాలాజీ విశ్వనాఽథ్‌ విజ్ఞప్తి

మార్కాపురం: మార్కాపురం పట్టణంలో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి తెప్పోత్సవానికి అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఈఓ శ్రీనివాసరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఏఓ బాలాజీ విశ్వనాఽథ్‌ కోరారు. మంగళవారం సాయంత్రం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఏటా కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవాన్ని కోనేరులో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈనెల 24న సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌, విద్యుత్‌, వైద్య ఆరోగ్యశాఖాధికారులు సహకరించాలని ఈఓతోపాటు చైర్మన్‌ కేశవరావు విజ్ఞప్తి చేశారు. సీఐ భీమానాయక్‌ మాట్లాడుతూ.. 24న సాయంత్రం 4 గంటల నుంచి దోర్నాల–వినుకొండ వైపు నుంచి వచ్చే బస్సులు మార్కెట్‌ యార్డు నుంచి వై జంక్షన్‌, చెరువుకట్ట మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకునేలా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నామని తెలిపారు. తెప్పోత్సవంలో పాల్గొనే అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లను తమకు ముందుగానే తెలియజేయాలని కోరారు. కోనేటి వద్ద ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలని సూచించారు. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. కోనేటి వద్ద సాయంత్రం 4 గంటల నుంచి ఉత్సవం ముగిసే వరకు అంబులెన్స్‌తోపాటు డాక్టర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో కమిషనర్‌ గిరికుమార్‌, డీవైఎంహెచ్‌ఓ పద్మావతి, ఏడీఈ సీయానాయక్‌, కమిటీ సభ్యులు అర్జునరావు, డీటీ ఫర్వీన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉత్సవానికి పటిష్ట బందోబస్తు

డీఎస్పీ వీరరాఘవరెడ్డి

మార్కాపురం టౌన్‌: మార్కాపురంలో ఈనెల 24న నిర్వహిస్తున్న చెన్నకేశవస్వామి తెప్పోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. ఉత్సవం నిర్వహించనున్న పుష్కరిణిని మంగళవారం సీఐ భీమానాయక్‌తో కలిసి పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సూచనలిచ్చారు. కోనేటికి నలువైపులా పోలీసు బందోబస్తుతోపాటు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలని, డివిజన్‌ పరిధిలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌ల నుంచి సిబ్బందిని రప్పించాలని సీఐని ఆదేశించారు. ఉత్సవానికి సుమారు 10 వేల నుంచి 12 వేలకు పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని డీఎస్పీకి ఈవో శ్రీనివాసరెడ్డి వివరించారు. ఆయన వెంట పట్టణ ఎస్సై సువర్ణ, సిబ్బంది ఉన్నారు.

మాట్లాడుతున్న ఈవో శ్రీనివాసరెడ్డి
1/1

మాట్లాడుతున్న ఈవో శ్రీనివాసరెడ్డి

Advertisement
 
Advertisement