నిజమైన హీరోలు విభిన్న ప్రతిభావంతులు | Sakshi
Sakshi News home page

నిజమైన హీరోలు విభిన్న ప్రతిభావంతులు

Published Sat, Nov 18 2023 1:52 AM

దివ్యాంగ విద్యార్థులకు ట్యాప్స్‌ పంపిణీ చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ - Sakshi

రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌

యర్రగొండపాలెం: విభిన్న ప్రతిభావంతులు నిజమైన హీరోలని, వారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. స్థానిక బీఆర్‌ అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి విభిన్న ప్రతిభావంతులకు కావలసిన ఉపకరణాలు అందించేందుకు వారిని గుర్తించే ఎసెస్‌మెంట్‌ క్యాంపులో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలుస్తున్నారని, చిరువ్యాపారులు చేసే దివ్యాంగులను గుర్తించి మెప్మా ద్వారా రూ.10 వేల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నారని, స్టెప్‌ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు అందజేసేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. గతంలో నిర్వహించిన క్యాంపునకు సంబంధించిన 73 ఉపకరణాలు రావాల్సి ఉందని, అందుకు రూ.12 లక్షలు చెల్లించాల్సి ఉందని, ఆ డబ్బును తానే చెల్లించి డిసెంబరు నెలాఖరులోపు ఉపకరణాలు పంపిణీ చేస్తానని హర్షధ్వనుల మధ్య ప్రకటించారు. ఈ శిబిరంలో అలంకో సంస్థ ప్రతినిధులు 60 మంది విభిన్న ప్రతిభావంతులను గుర్తించి వారికి ఉపకరణలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన ఏడుగురు విభిన్న ప్రతిభావంతులకు మంత్రి ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు టాబ్స్‌, దృష్టి లోపం ఉన్న ముగ్గురికి, వినికిడి లోపం ఉన్న మరో ముగ్గురికి ఉపకరణలు అందజేశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమశాఖాధికారిణి అర్చన, ఎంఈవోలు ఎం.ఆంజనేయులు, మల్లూనాయక్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్‌, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్‌, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ షాబీర్‌బాష పాల్గొన్నారు. .

Advertisement
Advertisement