మానవాళికి ప్రమాదకరం | Sakshi
Sakshi News home page

మానవాళికి ప్రమాదకరం

Published Fri, Nov 17 2023 1:40 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌  - Sakshi

వ్యర్థాలను నిర్లక్ష్యం చేస్తే

ఒంగోలు: వ్యర్థాలను నిర్లక్ష్యం చేస్తే అది మానవాళికి ప్రమాదకరంగా మారుతుందని, వాటిని తిరిగి వినియోగించుకుంటూ మానవాళికి ఉపయోగకరంగా మార్చుకునే అంశంపై ప్రతి ఒక్కరూ దృష్టిసారించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం నిర్వహించిన ‘‘వ్యర్థాల నిర్వహణ–తిరిగి వినియోగం–పర్యావరణ పరిరక్షణ’’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సెమినార్‌కు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు వ్యర్థాలను తిరిగి వినియోగించుకోవడం అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సెమినార్‌ ద్వారా జిల్లాలో ఉన్న పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, అంతర్జాతీయంగా జరుగుతున్న వినియోగ పద్ధతులను ఆకళింపు చేసుకోవడం వంటివి ఈ సెమినార్‌ ద్వారా సాధ్యపడుతుందన్నారు. అధ్యక్షత వహించిన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ రెండురోజులపాటు నిర్వహిస్తున్న సెమినార్‌లో తొలిరోజు 35 మంది తమ పరిశోధన పత్రాలను చదివి వినిపిస్తారన్నారు. అనంతరం నివేదిక రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కలెక్టర్‌కు నివేదిక అందిస్తామన్నారు. రీసస్టైనబుల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ సీఈఓ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతంరెడ్డి మాట్లాడుతూ నేడు ప్రతి రోజు ఒక్కో వ్యక్తి నుంచి 500 గ్రాములు మొదలు 600 గ్రాముల వరకు వ్యర్థాలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ ద్వారా వ్యర్థాలను వందశాతం తిరిగి వినియోగించడం అనే విధానంలో వస్తువుల ఉత్పత్తి చేస్తున్నామని, ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెమినార్‌కు వచ్చామన్నారు. జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహక సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎస్‌.గ్లోరీ స్వరూప మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ సెమినార్‌ను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. డెన్మార్క్‌ నుంచి వచ్చిన ప్రత్యేక అతిథి సారాపెట్రిసర్‌ హాన్సన్‌ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పర్యావరణాన్ని మెరుగుపరుచుకోవడం, వస్తున్న వ్యర్థాలను తిరిగి వినియోగించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించడం, ఆధునిక సాంకేతికతను శిక్షణ ద్వారా అందించడం వంటి కార్యక్రమాల ద్వారా సవాళ్లను అధిగమిస్తున్నామన్నారు. కొలంబో నుంచి వచ్చిన ప్రతినిధి శాంతాలింగం సాయనాథన్‌ మాట్లాడుతూ ఘన వ్యర్థాల నియంత్రణకు సంబంధించి తీసుకుంటున్న విధానాలను వివరించారు. ప్లాస్టిక్‌ వ్యాప్తిని నియంత్రించడం, ఇందుకోసం జెనిటిక్‌ ఇంజినీరింగ్‌, రసాయనిక పదార్థాల రీసైక్లింగ్‌, నానో టెక్నాలజీ ద్వారా ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ వంటి అంశాలపై ఉదహరించారు. మలేషియా ప్రభుత్వ జాతీయ సర్క్యులర్‌ ఆర్థిక మండలి ప్రతినిధి డాక్టర్‌ ఉమేశ్వర మాట్లాడుతూ రోజుకు మలేషియాలో 36699 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయన్నారు. వ్యర్థాల నిర్వహణ ద్వారా సంపదను సృష్టించుకోగలిగితే తలసరి ఆదాయంతోపాటు జాతీయ ఆదాయం, ఉద్యోగాల కల్పన మెరుగవుతుందన్నారు. కార్యక్రమంలో ఏకేయూ రిజిస్ట్రార్‌ హరిబాబు, ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ సీహెచ్‌ రామకృష్ణారావు, ప్రిన్సిపాల్‌ నటరాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడుకుంటూ తిరిగి వినియోగించుకునే అంశంపై దృష్టిసారించాలి అంతర్జాతీయ సదస్సులో కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌

Advertisement
 
Advertisement
 
Advertisement