సాధికార శక్తి | Sakshi
Sakshi News home page

సాధికార శక్తి

Published Thu, Nov 16 2023 12:34 AM

- - Sakshi

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. నిరంతరం ఆదాయం పొందేలా చేయూతనిచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ద్వారా వడ్డీలేని రుణాలు అందివ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలపై ఎలాంటి భారం పడకుండా రుణాలు చెల్లిస్తూ సొంతకాళ్లపై నిలబడేందుకు ‘ఉన్నతి–మహిళా శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఆటోలు ఇవ్వనున్నారు. జిల్లాలో ఆటోల కోసం మొత్తం 15 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 13 మందిని ఎంపిక చేశారు.

మహిళల సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆర్ధిక, సామాజిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం అన్నీ విధాలుగా అనేక చర్యలు తీసుకుంటోంది. పేదరికం నుంచి విముక్తి కోసం మహిళకు అండగా నిలుస్తుంది. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కావాల్సిన మౌలిక వసతులు, ఆర్ధిక తోడ్పాటు అందిస్తుంది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని తమకు అనుగుణంగా మార్చుకొని గ్రామీణ మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలి. ఇందులో భాగంగానే ఉన్నతి పథకానికి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రూపకల్పన చేశారు. మహిళలు తమ శక్తిని నిరూపించుకునేందుకు ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– తేళ్ల రవికుమార్‌, పీడీ, డీఆర్డీఏ

జగనన్న ఇస్తున్న సహకారం

మరిచిపోలేను

నేను 8 వ తరగతి వరకు చదువుకున్నాను. నా భర్త బేల్దారు పనులు చేస్తూనే మరింత ఆదాయం కోసం ఆటో వేస్తుంటారు. మాకు ఇద్దరు సంతానం. వారి ఉన్నతి కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నాను. అందుకే నాభర్తకు తోడుగా నేను కూడా ఆటో నడపాలని, కుటుంబం కోసం ఇద్దరం కలిసి కష్ట పడాలనుకుంటున్నాను. అందుకే నేను ఉన్నతి పథకంలో ఆటో కోసం రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. నాకు రుణం మంజూరు చేయడమే కాకుండా విజయవాడలో డ్రైవింగ్‌లో శిక్షణ కూడా ఇచ్చారు. నాకు జగనన్న కాలనీలో ఇళ్లు కూడా వచ్చింది. పేద మధ్య తరగతి ప్రజల కోసం జగనన్న ఇస్తున్న సహకారం ఎన్నటికీ మరిచిపోలేం.

– దేవరపల్లి జెస్సి ప్రియ, కరవది

ఒంగోలు టౌన్‌: తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించేందుకు మహిళలు ఆటో డ్రైవర్‌ అవతారమెత్తాల్సి వస్తోంది. డ్రైవింగ్‌ నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేని కారణంగా అద్దెకు ఆటోలను తీసుకొని నడుపుకుంటున్నారు. ఆటో యజమానికి రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. దీంతో పాటుగా ఆటోలకు ఏదైనా సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు దానికి మరమ్మతులు సైతం వారే చేయించుకోవాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆటో నడిపినప్పుటికీ కనీసం కూలీ కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. పోనీ సొంతంగా ఆటో కొనుక్కోవాలంటే అందుకు ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అద్దె ఆటోలతో బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. దీన్ని గమనించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మహిళలకు ‘ఉన్నతి–మహిళా శక్తి’ పథకం ద్వారా సొంతంగా ఆటోలు ఇవ్వాలని నిర్ణయించింది. తొలి విడత రాష్ట్ర వ్యాపంగా 229 మంది ఎంపిక కాగా జిల్లా నుంచి 13 మంది మహిళలను ఎంపిక చేశారు.

వడ్డీ లేకుండా...

మహిళల ఆదాయాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అక్కా చెల్లెమ్మల కోసం ఉన్నతి– మహిళా శక్తిని రూపొందించిన అధికారులు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు సమాయత్తమయ్యారు. ఇందుకుగాను దరఖాస్తులను ఆహ్వానించి పలువురిని ఎంపిక చేశారు. లబ్ధిదారులు ఆటో కొనుగోలులో అయ్యే ఖర్చులో కేవలం 10 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 90 శాతం రుణం సెర్ప్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ రుణానికి ఎలాంటి వడ్డీ ఉండదు. మొత్తం రుణాన్ని 48 సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం మహిళలకు తప్పనిసరిగా డ్రైవింగ్‌ వచ్చి ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. డ్వాక్రా సభ్యులకు మాత్రమే రుణాలు ఇస్తారు. జిల్లాలో ఎంపికై న 13 మంది లబ్ధిదారులకు ఇటీవల విజయవాడలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఆటోలు ఎక్కువ కాలం మన్నడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆయిల్‌ వినియోగంలో జాగ్రత్తలు, రోడ్డు మీద డ్రైవింగు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలను నిపుణులు వివరించారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలను ఎలా రిపేర్లు చేసుకోవాలో శిక్షణ ఇచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. అంతే కాకుండా స్థానికంగా ట్రాన్స్‌పోర్టు అధికారులకు కూడా ప్రభుత్వం పలు సూచనలు చేసింది. లైసెన్సుల జారీల విషయంలో ఉన్నతి లబ్ధిదారులకు సహకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అంబేడ్కర్‌ వర్ధంతికి ఆటోల పంపిణీ...

ఉన్నతి పథకం కింద జిల్లాలోని ఒంగోలు మండలం నుంచి ఇద్దరు, నాగులప్పలపాడు మండలం నుంచి నలుగురు, తాళ్లూరు నుంచి ఒకరు, పుల్లలచెరువు నుంచి ముగ్గురు, దొనకొండ, గిద్దలూరు, రాచర్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపికయ్యారు. ఎంపికకై న లబ్ధిదారులకు డిసెంబరు 6వ తేదీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ వర్దంతి రోజు ఆటోలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని మరికొంతమందిని ఎంపికచేసి ఆటోలు పంపిణీ చేయనున్నారు. మొత్తం మీద ప్రతి మండలంలోనూ ఈ ఆటోలను పంపిణీ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వలక్ష్యం.

నిరంతర ఆదాయం కోసం జగనన్న వినూత్న పథకం ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీ లేకుండా ఆటోలకు రుణాలు 48 సులభ వాయిదాల్లో చెల్లించేలా నిబంధనలు జిల్లాలో 13 మంది ఎంపిక

1/2

2/2

Advertisement
 

తప్పక చదవండి

Advertisement