రాజకీయ ఎదుగుదల అడ్డుకునేందుకే కబ్జా ఆరోపణలు | Sakshi
Sakshi News home page

రాజకీయ ఎదుగుదల అడ్డుకునేందుకే కబ్జా ఆరోపణలు

Published Tue, Nov 14 2023 1:44 AM

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌ గంగాడ సుజాత - Sakshi

ఒంగోలు సబర్బన్‌: రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేక అడ్డుకోవటానికే తన పై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారని, అందుకు కొందరు మీడియా వ్యక్తులను అడ్డం పెట్టుకొని తనను మానసికంగా కుంగదీసేందుకు యత్నిస్తున్నారని ఒంగోలు నగర మేయర్‌ గంగాడ సుజాత ధ్వజమెత్తారు. ఈ మేరకు స్థానిక సంతపేటలోని మేయర్‌ నివాసంలో సోమవారం పలువురు ఒంగోలు కార్పొరేటర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ త్రోవగుంట సమీపంలోని మండువారిపాలెం గ్రామ పరిధిలో తాను, తన భర్త కలిసి 14 ఎకరాలు కబ్జా చేశామని, ఆ భూమి విలువ దాదాపు రూ.50 కోట్లు ఉంటుందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు ప్రసారం చేశారన్నారు. ఆ కథనాలు పచ్చి అవాస్తవాలు, అసత్య కథనాలని మేయర్‌ కొట్టిపారేశారు. త్రోవగుంట సమీపంలోని మండువారిపాలెంలోని కొందరు వ్యక్తులు వచ్చి తమ పొలాలను ఆక్రమించుకున్నారని, కనీసం కౌలు కూడా ఇవ్వటం లేదని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారికి న్యాయం చేద్దామని, ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులతో మాట్లాడి, రికార్డులు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించానన్నారు. దానిని కొందరు తనపై కుట్రపన్ని కబ్జా ఆరోపణలకు తెరలేపారని మేయర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మండువారిపాలెంలో భూములను కొందరు కమ్మ కులానికి చెందిన వారు ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. వారిని ప్రశ్నించేసరికి దానిని తనమీదకు రుద్దే కుయుక్తులు పన్నారని ధ్వజమెత్తారు. అక్కడే ఇరిగేషన్‌ కాలువకు చెందిన భూములను బీఎంఆర్‌ వాళ్లు ఆక్రమించారని, మరి అలాంటి వారి మీద మాత్రం రాయరని నిలదీశారు. అంటే వాళ్లు అగ్రవర్ణాలు అనేనా అని ప్రశ్నించారు. తాను ఒక దళిత మహిళను అనా లేక బయట నుంచి వచ్చానని తన మీద రాస్తున్నారా అని ప్రశ్నించారు. బాలినేని శ్రీనివాస రెడ్డి దయతో ఒంగోలు నగర మేయర్‌ని అయ్యానన్నారు. అసలు భూ కబ్జాలు, నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారాన్ని తొలుత కలెక్టర్‌కు తాను, వైఎస్సార్‌సీపీ నాయకులు చుండూరు రవితో కలిసి ఫిర్యాదు చేశామన్నారు. అలాంటిది తనపై కబ్జా ఆరోపణలు చేసి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని, రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. తనది, తన భర్తది కష్టపడే మనస్తత్వమని, పది మందికి సాయం చేస్తే తత్వమే కానీ, ఒకరినుంచి లాక్కుందామని ఏనాడూ భావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, వ్యక్తుల పరంగా నష్టపోయామే కానీ లాభపడింది లేదన్నారు. మీడియా వాళ్లు లేనిపోని ఆరోపణలు చేసి తన రాజకీయ జీవితాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్‌ ఆస్తులను కాపాడే పనిలో నిమగ్నమయ్యామన్నారు. సమావేశంలో కార్పొరేటర్‌ ఆదిపూడి గిరిజా శంకర శాండిల్య మాట్లాడుతూ నిందారోపణలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. రైతుల పొలాలను ఇతరులు అన్యాక్రాంతం చేస్తే ఆ విషయాన్ని వాళ్లు మేయర్‌ దృష్టికి తీసుకొస్తే వాటిపై కూడా ఇలాంటి నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు మేయర్‌ వివరణ కూడా తీసుకోవాలి కదా అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు చింతపల్లి గోపీచంద్‌, తాడి కృష్ణలత, వైఎస్సార్‌సీపీ నాయకురాలు చింతగుంట్ల సువర్ణ పాల్గొన్నారు.

ఒకరికి సాయం చేసే మనస్తత్వం మా కుటుంబానిది రాజకీయంగా, వ్యక్తులపరంగా నష్టపోయానే తప్ప లాభపడింది లేదు అసలు కబ్జాలు, నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందే నేను విలేకరుల సమావేశంలో మేయర్‌ గంగాడ సుజాత

Advertisement
 
Advertisement