వచ్చేనెల డీఈడీ రెండో సెమిస్టర్‌ థియరీ పరీక్షలు | Sakshi
Sakshi News home page

వచ్చేనెల డీఈడీ రెండో సెమిస్టర్‌ థియరీ పరీక్షలు

Published Thu, Nov 9 2023 1:12 AM

సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్‌ 
దినేష్‌కుమార్‌  - Sakshi

ఒంగోలు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ రెండో సెమిస్టర్‌ 2022–24 రెగ్యులర్‌, 2021–23, 2020–22 బ్యాచ్‌లలో ఫెయిలైన విద్యార్థులకు డిసెంబర్‌ నెలలో థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్‌ సుబ్బారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 24వ తేదీలోపు అన్ని సబ్జక్టులకు రూ.150, మూడు సబ్జక్టులకు రూ.140, రెండు సబ్జక్టులకు రూ.120, ఒక సబ్జక్టుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అపరాధ రుసుము అదనంగా రూ.50లతో ఈనెల 30వతేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఫీజును విద్యార్థులు వారు అభ్యసించిన కాలేజీ ప్రిన్సిపాల్‌కు చెల్లించాలన్నారు.

నేటి నుంచి రేపల్లె–

మార్కాపురం రైలు రాకపోకలు

మార్కాపురం: రేపల్లె–మార్కాపురం, మార్కాపురం–తెనాలి రైళ్లను గుంటూరు రైల్వే డివిజన్‌ అధికారులు గురువారం నుంచి పునరుద్ధరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారి ఎ.సురేష్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారని గుంటూరు రైల్వే డివిజన్‌కు సంబంధించి మార్కాపురం పట్టణానికి చెందిన డీఆర్‌యూసీసీ మెంబరు ఆర్‌కేజే నరసింహం బుధవారం తెలిపారు. గుంటూరు–గుంతకల్‌ డబ్లింగ్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ రైళ్లను ఇటీవల రద్దు చేశారు. మళ్లీ గురువారం నుంచి రాకపోకలు యధావిధిగా ఉంటాయని ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 07889 రైలు ఉదయం 4 గంటలకు రేపల్లెలో బయలుదేరి 9.45 గంటలకు మార్కాపురం వస్తుందని తెలిపారు. 07890 రైలు ఉదయం 9.50 మార్కాపురం నుంచి బయలుదేరి తెనాలికి మధ్యాహ్నం 2 గంటలకు చేరుతుందని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ

ఓటరుగా నమోదు కావాలి

కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

ఒంగోలు అర్బన్‌: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని అందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ అన్నారు. బుధవారం ప్రకాశం భవనంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌పై సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు జాబితా పూర్తి పారదర్శకంగా రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్నీ కాలేజిల్లో ఫారం–6 ద్వారా అర్హులైన వారిని కొత్తగా ఓటరు జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వచ్చిన ఈవీఎంల ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ పూర్తయిందని తెలిపారు. రాజకీయ పార్టీలు బీఎల్‌ఏలను ఏర్పాటు చేసుకుని బీఎల్‌ఓలకు సహకరించాలన్నారు. వచ్చే జనవరి 5వ తేదీ తుది ఓటరు జాబితా ప్రకటిస్తామన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, డిలీషన్‌లు వంటివి పక్కాగా పరిశీలించి చేయాలన్నారు. ఓటరుకు ఆధార్‌ అనుసంధనం వేగంగా పూర్తి చేయాలన్నారు. దీనిలో జాయింట్‌ కలెక్టర్‌ కె శ్రీనివాసులు, ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, వైఎస్‌ఆర్‌ సీపీ ప్రతినిధి దామ రాజు క్రాంతికుమార్‌, ఇతర పార్టీల ప్రతినిధులు కాలేషాబేగ్‌, స్వరూప్‌,రసూల్‌, రాజశేఖర్‌, సత్యం, సుదర్శన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

పాడి పరిశ్రమల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

ఒంగోలు టౌన్‌: జగనన్న పాలవెల్లువ, పాడిపరిశ్రమల అభివృద్ధిలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు సరఫరా చేయడానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరక్టర్‌ టి.రవికుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వైఎస్సార్‌ క్రాంతి పథకంలో పంపిణీ చేయనున్న నాణ్యమైన మేలుజాతి పాడి గేదెలు, చూడి గేదెలు, ఆవులను సరఫరా చేయడానికి అర్హత కలిగిన ఫారమ్‌ కలిగిన ఏజెన్సీలతో ఎన్‌ఫెనల్మెంట్‌ చేసేందుకు ప్రఖ్యాతి గాంచిన ఫారాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులతో పాటుగా బ్రోచర్‌తో కూడిన సొంత ఫారం రిజిస్ట్రేషన్‌, చిరునామా వివరాలను జత చేయాల్సి ఉంటుంది. పశువుల జాతి, ప్రాంతం, గతంలో చేపట్టిన ప్రాజక్టులకు సంబంధించిన అనుభవం తదితర వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. బ్యాంకు అకౌంటు, పన్నుల చెల్లింపు, పాడిగేదెలు, చూడు గేదెల జాతి వారీగా కొటేషన్‌ వివరాలను విధిగా జత చేయాలని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఒంగోలులోని ప్రగతి భవనంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement