ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తా

​Hyderabad: Etela Rajender Resigned His Mla Seat Comments On Trs Party - Sakshi

ఫ్యూడల్‌ మనస్తత్వంతో కేసీఆర్‌ పాలించాలనుకుంటున్నారు: ఈటల

అమరవీరుల స్తూపం వద్ద  నివాళులర్పించిన మాజీ మంత్రి 

ఎమ్మెల్యే పదవికి రాజీనామా..  

సాక్షి, హైదరాబాద్‌/మేడ్చల్‌ రూరల్‌: ‘నాది రైట్‌ లెఫ్ట్‌ ఎజెండా కాదు. నాది లౌకిక డీఎన్‌ఏ. తెలంగాణ ప్రజానీకాన్ని ఫ్యూడల్‌ నియంతృత్వం నుంచి తప్పించడమే నా ఎజెండా. దీన్ని ప్రజలు హర్షించి అర్థం చేసుకుంటారు. తెలంగాణ, హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేసేందుకు రాజీనామా చేస్తున్నా’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

శనివారం హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సందర్భంగా ఉదయం 10 గంటలకు షామీర్‌పేటలోని తన నివాసం నుంచి కాన్వాయ్‌గా బయలుదేరిన ఈటల అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. తర్వాత అమరవీరుల స్తూపం, అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ‘చాలామంది శ్రేయోభిలాషులు కొత్త పార్టీ పెట్టమని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తామనే హామీ గంగలో కలిసింది. ఇక్కడ మేధావులు సహా ఎవరికీ గుర్తింపు లేదు. చైతన్యానికి నిలయమైన తెలంగాణలో దానిని నాశనం చేశారు. ప్రజాస్వామ్యం ఊసులేకుండా ఫ్యూడల్‌ మనస్తత్వంతో చక్రవర్తిలాగా కేసీఆర్‌ పాలన చేయాలనుకుంటున్నారు. కుట్రలను హుజూరాబాద్‌ ప్రజల అండతో ఎదుర్కొని కురుక్షేత్ర సంగ్రామంలో గెలుస్తా. నియంతృత్వ పోకడలు తుద ముట్టించి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించే పోరాటానికి అంకితమవుతా’అని ఈటల ప్రకటించారు.

వారం రోజులు నిరీక్షించా..
‘అసెంబ్లీలో అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి రాజీనామా చేయాలనుకున్నా అవకాశం చిక్కలేదు. స్పీకర్‌తో నేరుగా మాట్లాడి రాజీనామా పత్రం ఇవ్వాలని వారం రోజులు నిరీక్షించినా కోవిడ్‌ను అడ్డుపెట్టుకుని స్పీకర్‌ కలవలేదు. అనివార్య పరిస్థితుల్లో అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించి రాజీనామా చేస్తున్నా. 2001 తరహాలో 2021లో మరో తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి సిద్దం. కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు ఒక్కటయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డికి ఆర్థిక సాయం చేశారు’అని ఈటల వ్యాఖ్యానించారు. మేడ్చల్‌ మండలంలోని పూడూర్‌ గ్రామ పరిధిలోని ఈటల నివాసం వద్ద నాయకుల కోలాహలం నెలకొంది.

ఈటల వెంట పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ ఈ నెల 14న ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతల సమక్షంలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈటలతోపాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గండ్ర నళిని, అందె బాబయ్య, వీకే మహేశ్, కేశవరెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు బీజేపీలో చేరనున్నారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అనుచరులతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్లు ఈటల వెల్లడించారు. తెలంగాణవ్యాప్తంగా పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరతారని ప్రకటించారు. 

తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి రాజీనామా
హుజూరాబాద్‌ శాసనసభ్యత్వానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం రాజీనామా చేశారు. శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శిని ఉదయం 11.30 గంటలకు ఆయన చాంబర్‌లో కలిసి రాజీనామా లేఖను అందజేశారు. దీన్ని స్పీకర్‌ ఆమోదించడంతో ఆయన కార్యాలయం గెజిట్‌ విడుదల చేసింది. ఈటల రాజీనామాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సమాచారమిచ్చింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత పరిమిత సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఈటల అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లారు. అయితే, ఈటల ఒక్కరినే లోనికి అనుమతించారు. ఈటల రాక నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మొత్తానికి మూడోసారి..
2014 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది మొదలు ఇప్పటి వరకు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యేగా ఈటల ప్రత్యేకత సాధించారు. 2004, 2008లో కమలాపూర్‌ నుంచి 2009, 2010, 2014, 2018లో హుజూరాబాద్‌ నుంచి అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ తరపున ఈటల ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఈటల 2008, 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లయింది. 2002లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఈటల ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. భూ ఆక్రమణ ఆరోపణలపై ఏప్రిల్‌ చివరి వారంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురయ్యారు.

చదవండి: Huzurabad: ఈటలపై బరిలోకి కౌశిక్‌రెడ్డి?!

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top