షర్మిల నిర్ణయం ఆమె వ్యక్తిగతం: సజ్జల

YSRCP Sajjala Ramakrishna Reddy On YS Sharmila Meeting In Hyderabad - Sakshi

తెలంగాణలో పార్టీ వద్దని జగన్‌ సూచన

భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కావు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో తెలంగాణకు చెందిన కొందరు అభిమానలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై స్పందించారు. షర్మిల నిర్ణయం ఆమె వ్యక్తిగతం అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కోట్లాది మంది ప్రజల అభిమానంతో పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే ఆయన ఆలోచన. తెలంగాణలో పార్టీపై చాలాసార్లు చర్చ జరిగింది. ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని వైఎస్‌ జగన్‌ వద్దన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముద్దుల తనయ వైఎస్‌ షర్మిల. కోట్లాది మందికి షర్మిల పరిచయం. ప్రస్తుత పరిణామాలపై తప్పుడు భాష్యం వచ్చే అవకాశముంది’’ అన్నారు.

తెలంగాణలో పార్టీ వద్దని జగన్‌ సూచన
‘‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవానికి ఒక ప్రత్యేక సందర్భం ఉంది. కోట్లాది మంది మీద అభిమానంతో వైఎస్‌ జగన్‌ నాడు ఓదార్పుయాత్ర చేశారు. దీన్ని ఓర్చుకోని కాంగ్రెస్‌ పార్టీ బయటకు పంపించే ప్రయత్నం చేసింది. మొదట వైఎస్‌ జగన్‌, విజయమ్మ కాంగ్రెస్‌ను వీడి వచ్చారు. ఆ తర్వాత వైఎస్‌ను అభిమానించే నాయకులు పార్టీలో చేరారు. గత మూడు నెలలుగా ఈ విషయంపై చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ తెలంగాణలో ఎందుకు ఉండకూడదు అన్న చర్చ వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశే ముఖ్యమని.. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్‌ సూచించారు. తెలంగాణలోకి వెళ్లాలన్న ఆలోచన పార్టీకి ఏ మాత్రం లేదు. తెలంగాణలో మరో పార్టీ ప్రారంభించాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోంది.ఇవి భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కావు’’అన్నారు సజ్జల.

షర్మిల నిర్ణయం ఆమె వ్యక్తిగతం
‘‘రాజకీయ సిద్ధాంతంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. తెలంగాణలో పార్టీ వద్దు అని ఒక స్థిరమైన అభిప్రాయంతో సీఎం జగన్‌ ఉన్నారు. షర్మిల మాత్రం పాదయాత్ర చేసి, పార్టీ పెట్టాలన్నట్టు కనిపిస్తున్నారు. తండ్రి స్పూర్తితో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ రాష్ట్రానికి జవాబుదారీ. షర్మిల తీసుకున్న నిర్ణయం ఆమె సొంత నిర్ణయం. తెలంగాణలో మరో పార్టీ పెట్టాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్‌ సూచించారు. ఏపీకే కట్టుబడి ఉండాలన్నది సీఎం జగన్‌ నిశ్చితాభిప్రాయం’’ అని సజ్జల స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top