నేను టీడీపీ అయితే కేసీఆర్‌ ఏంటో?

TPCC Chief Revanth Reddy Comments On KCR And KTR - Sakshi

మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్న 

ప్రస్తుత రాష్ట్ర కేబినెట్‌ మొత్తం టీడీపీయే కదా? 

బరాబర్‌ సీఎం పదవిని ఇచ్చినవాళ్లే గుంజుకుంటారు 

2022 ఆగస్టులోనే అసెంబ్లీ రద్దు చేసి 

కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను టీడీపీ వాడినైతే మరి సీఎం కేసీఆర్‌ ఏంటి?’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌కు అధ్యక్షుడు అయితే, నేను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిని అని వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సహచరుడిగా పని చేశానని, కేసీఆర్‌లాగా బానిస పని చేయలేదని చెప్పారు. ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం టీడీపీ వారే ఉన్నారని, కేసీఆర్‌తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం, గంగుల, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్‌లు ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కేటీఆర్‌ అసలు పేరు అజయ్‌ అని, ఆనాడు ఎన్టీఆర్‌ మెప్పు పొందేందుకు తారకరామారావుగా మార్చారని ఆరోపించారు. అందుకే తాను కేటీఆర్‌ను కేడీఆర్‌ అని పిలుస్తానని, అంటే కల్వ కుంట్ల డ్రామారావు అని పేర్కొన్నారు.   తాను పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కుంటే.. నాడు కేంద్రమంత్రి పదవిని కేసీఆర్‌ ఎంతకు కొ న్నారో చెప్పాలన్నారు. తన కుటుంబం మొత్తాన్ని సోనియాగాంధీ వద్దకు తీసుకెళ్లి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పిన విషయాన్ని కేసీఆర్‌ అండ్‌ కో గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. 

బావ, బామ్మర్దులు బయటకొచ్చారు 
కేసీఆర్‌ నుంచి అధికారం గుంజుకుంటామని అనగానే బావ, బామ్మర్దులు బయటకు వచ్చారని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌కు అధికారం ఇచ్చిన వారే దానిని గుంజుకుంటారంటూ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తన ప్రభుత్వాన్ని ముందే రద్దు చేసి, 2022 ఆగస్టు 15 తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ, ఏపీల మధ్య నీళ్ల పంచాయితీ లేనేలేదని, ఇది రెండు రాష్ట్రాలు ఆడుతున్న సురభి నాటకమని ఎద్దేవా చేశారు.   షర్మిల ఎవరి బాణమో తెలియదన్నారు.

వారిని  వదిలేది లేదు..
టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను వది లేది లేదని రేవంత్‌ హెచ్చరించారు. ఒత్తిడి కారణంగా కాంగ్రెస్‌ను వదిలివెళ్లిన వారికి మాత్రమే ఘర్‌ వాపసీ ఉంటుందని, అమ్ముడుపోయినవారికి ఆ అవకాశమే లేదని తేల్చిచెప్పారు. ఈటల స్వతంత్రంగా నిలబడితే ఉద్యమకారుడనే గుర్తింపు ఉండేదని చెప్పారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోదీ అన్నప్పుడే బీజేపీ పని అయిపోయిందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top