కేసీఆర్‌ వరేసుకోవాలి.. రైతులు ఉరేసుకోవాలా?

Telangana: Revanth Reddy Sensational Comments On CM KCR - Sakshi

150 ఎకరాల్లో సీఎం వరి పండిస్తున్నారు: రేవంత్‌ 

కేసీఆర్‌ భూమి పచ్చగుండాలి.. రైతులు ఉరేసుకోవాలా? 

యాసంగిలో వరి వేయండి.. ఎందుకు కొనరో చూస్తాం 

కేంద్రం మళ్లీ నల్ల చట్టాలు తెస్తామంటే కాంగ్రెస్‌ ఊరుకోదని హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్‌ ఈ యాసంగిలో వరి సాగు చేస్తున్నారు. తన సొంత పొలంలో 150 ఎకరాల్లో పండిస్తున్నాడు. రైతులెవరూ వరి వేయొద్దు.. వరి వేస్తే ఉరే అని చెప్పి తాను ఎందుకు వేశారు? కేసీఆర్‌ భూమి పచ్చగుండాలి. రైతులు ఉరేసుకోవాలా? తనకో న్యాయం, ప్రజలకో న్యాయమా? యాసంగిలో రైతులందరూ వరి సాగు చేయండి. ప్రభుత్వం ఎందుకు కొనదో చూస్తాం’అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

ఆదివారం సాయం త్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్‌ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్, కోటూరి మానవతారాయ్, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌ సాగు చేసిన వరి పంటను మీడియాకు చూపిస్తానని చెప్పారు. కనీస మద్దతు ధర ప్రకటించిన 23 పంటలను కొనుగోలు చేయాల్సిందేనని, రాష్ట్రాలు కొనాలని చట్టాలు చెబుతున్నాయని తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లో కేంద్రమే నేరుగా పంటలను కొంటే రాష్ట్రంలో మాత్రమే ప్రభుత్వం కొని కేంద్రానికి అమ్ముతోందని చెప్పారు. మోదీ, కేసీఆర్‌ల వైఖరి వల్ల తెలంగాణ రైతులు ఉరి వేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఛత్తీస్‌గఢ్‌లో ఏం చేస్తున్నారో చూడండి: ఇతర దేశాల్లో మన బియ్యానికి మంచి డిమాండ్‌ ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పంట కొని నేరుగా అమ్ముకోవచ్చని రేవంత్‌ చెప్పారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోస పట్టించుకోకుండా రాజకీయ క్రీడలు ఆడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయని ప్రభుత్వాలపై పీడీ యాక్టులు పెట్టి పాలకులను జైళ్లలో పెట్టాలన్నారు.

చత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ క్వింటాకు రూ. 2,540 ఇచ్చి వరి కొంటోందని, యాసంగిలో వరి వేయని రైతాంగానికి చిరు ధాన్యాలు సాగు చేసేందుకు ఎకరాకు రూ. 9 వేల బోనస్‌ ఇస్తోందని చెప్పారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు వెళ్లి ఆ రాష్ట్రంలో అమలవుతున్న విధానాల గురించి తెలుసుకోవాలని, లేదంటే తనతో వచ్చినా అక్కడి సీఎంను, మంత్రులను కలిపిస్తానని చెప్పారు.  

కేసీఆర్, కేటీఆర్‌ ఎటువైపు?: రైతులకు క్షమాపణ చెప్పి మరీ ఉపసంహరించుకుంటామన్న నల్ల వ్యవసాయ చట్టాలను మళ్లీ తెస్తా మని కేంద్రం చెప్పడం దారుణమని రేవంత్‌రెడ్డి అన్నారు. సూటు, బూటు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని మరోమారు రుజువయిందన్నారు. ప్రచా ర ఆర్భాటాలు తప్ప రైతుల గోస పట్టని సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌ ఈసారి ఎటు వైపు ఉంటారో తేల్చుకోవాలని అన్నారు.

రైతాంగ పోరాటం లో అమరులైన రైతులకు పరిహారం ఇస్తానన్న కేసీఆర్‌.. ఇంకా దాని ఊసెత్తడం లేదని, ఇటీవల వారం రోజులు ఢిల్లీలో ఉండి వచ్చిన మంత్రులు కనీసం వారి వివరాలు కూడా సేకరించి నట్టు లేదని మండిపడ్డారు. వ్యవసా యంపై మళ్లీ నల్ల చట్టాలు తెస్తామంటే కాంగ్రెస్‌ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు.  

నేడు ఎర్రవెల్లిలో ‘రచ్చబండ’ 
ఎర్రవెల్లి గ్రామంలో టీపీసీసీ కిసాన్‌ సెల్‌ ఆధ్వర్యంలో నేడు ‘రైతులతో రచ్చబండ’కార్యక్రమం జరగనుంది. ధాన్యం కొనుగోళ్ల సమస్యతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వివరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ కీలక నాయకులు రచ్చబండకు హాజరవుతారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

ఆదివారం ఉదయం ఎర్రవెల్లి గ్రామానికి రచ్చబండ ఏర్పాట్ల కోసం వెళ్లిన కాంగ్రెస్‌ నాయకులకు స్థానిక టీఆర్‌ఎస్‌ నేతల నుంచి నిరసన ఎదురైంది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎర్రవెల్లిలో రచ్చబండ హాట్‌ టాపిక్‌గా మారింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top