ఢిల్లీ వెళ్లండి.. గల్లా పట్టుకోండి

Telangana: Minister KTR Fires On Bandi Sanjay - Sakshi

బండి సంజయ్‌ దీక్షపై బహిరంగ లేఖలో మంత్రి కేటీఆర్‌ సవాల్‌ 

15 లక్షల ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదో ప్రధానిని అడగండి 

కేంద్రం వైఫల్యాలను కప్పిపుచ్చడానికి బీజేపీ ప్రయత్నం 

దేశంలో నిరుద్యోగితను రికార్డు స్థాయికి తీసుకెళ్లిన ఘనత మీది 

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని నమ్మించి మోసం చేశారు 

టీఎస్‌ ఐపాస్‌తో మేం 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ యువతను రెచ్చగొట్టడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. అస్తవ్యస్థ విధానాలతో దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని చరిత్రలోనే రికార్డు స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర బీజేపీ ప్రభుత్వానిదని విమర్శించారు.

ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని, ఇందులో భాగమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్ష ప్రకటన అని పేర్కొన్నారు. ‘మీరు దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో. హామీ ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన మా ప్రభుత్వాన్ని కాదు.. లక్షలాది ఉద్యోగాలను పెండింగ్‌లో పెట్టిన మీ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీయాలి.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 15 లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలి..’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బండి సంజయ్‌కు రాసిన బహిరంగ లేఖను మంత్రి ఆదివారం మీడియాకు విడుదల చేశారు. లేఖలో ఏముందంటే.. 

ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? 
‘మీది నిరుద్యోగ దీక్ష కాదు, పచ్చి అవకాశవాద, ఆత్మవంచన దీక్ష. ఉపాధి కల్పనకు నెలవుగా మారిన తెలంగాణలో రాజకీయ ఉద్యోగం లేక నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో దేశంలో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా...?

కరోనా సంక్షోభ సమయంలో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి కూడా సాయం చేయని భారతీయ జుమ్లా పార్టీ మీది కాదా? కేంద్ర ప్రభుత్వం కానీ, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కానీ కల్పించిన ఉద్యోగాలు, ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉన్న ఖాళీలపై ఒక శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?..’అని కేటీఆర్‌ సవాల్‌ చేశారు.  

తెలంగాణ ప్రభుత్వంతో మీకు పోలికా? 
‘కేంద్రాన్ని ప్రశ్నించలేని చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఉపాధి కల్పనలో మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదు. అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు దక్కించుకుంది. ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు తెలిసినా, తెచ్చిపెట్టుకున్న మతిమరుపుతో బండి సంజయ్‌ డ్రామా దీక్షకు దిగారు. లక్ష ఉద్యోగాల హామీని మించి 1.33 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా?.

విప్లవాత్మకమైన టీఎస్‌ ఐపాస్‌ విధానం తెచ్చి రూ.2.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు తెచ్చి సుమారు 16 లక్షలకు మందికి ఉద్యోగాలు కల్పించాం. టీఎస్‌ ఐపాస్‌ లెక్కలోకి రాని మరెన్నో లక్షల ఉద్యోగాలను ఇన్నోవేషన్, అంకుర పరిశ్రమల ఏర్పాటుతో కల్పించాం. టీ ఐడియా, టీప్రైడ్‌ వంటి విధానాలతో ప్రోత్సాహిస్తున్నాం, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో లక్షల ఉద్యోగాలు కల్పిస్తూనే కోట్లాది మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం.

ఎర్ర బస్సు నుంచి ఎయిర్‌ బస్‌ దాకా, ట్రాక్టర్‌ నుంచి హెలికాప్టర్‌ దాకా, యాప్స్‌ నుంచి యాపిల్‌ మ్యాప్స్‌ దాకా హైదరాబాదును ఇన్వెస్టర్ల డెస్టినేషన్‌గా మలిచాం. రాష్ట్రంలో యువతకు ఉపాధి కోసం చేపట్టిన భారీ పారిశ్రామిక పార్కులకు, ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలకు ఒక్కపైసా అదనపు సాయం చేయకపోగా.. హైదరాబాద్‌కు అద్భుత అవకాశమైన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసింది మీరు కాదా?

వీఆర్‌ఎస్‌/ సీఆర్‌ఎస్‌ ఇచ్చి ఉద్యోగాలను ఊడగొట్టిన పాపపు పాలన మీది కాదా..? ఒక ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ మాదిరి పాలన చేస్తూ ఉన్న వాటిని అమ్ముకుంటున్న మీరెక్కడ? ప్రైవేటీకరణ చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తున్నా.. ఆర్టీసీ, విద్యుత్, సింగరేణి లాంటి సంస్థలను కాపాడుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ?..’అని మంత్రి ఎద్దేవా చేశారు.  

మీ రిపోర్టు కార్డు ప్రజల ముందుంచాలి 
‘కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 9 లక్షల ఉద్యోగ ఖాళీలు, ప్రభుత్వ బ్యాంకులు, సాయుధ బలగాల్లోని 5 లక్షల ఖాళీలు మొత్తంగా 15 లక్షల ఖాళీలను ఎందుకు ఇంకా భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలి. ఈ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారో ముందు స్పష్టం చేయాలి. మీ ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్‌ కార్డుని ప్రజల ముందు ఉంచాలి.. ’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top