పచ్చిబియ్యం ఎంతైనా కొంటాం..

Telangana: Kishan Reddy Comments On CM KCR Over Boiled Rice - Sakshi

బాయిల్డ్‌ రైస్‌పై కేంద్రంతో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది 

ప్రజలంతా కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్నారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  

పలానా పంట వేయాలని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని సకల జనులు కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారని, దీంతో రాష్ట్రంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌పై ఇప్పటికే కేంద్రంతో ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఒప్పందం మేరకు ధాన్యం కొనుగోలు చేయడానికి, పచ్చి బియ్యం ఎంతైనా కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పలానా పంట వేయాలని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు.

శనివారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గభేటీలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం విషయంలో టీఆర్‌ఎస్‌ బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సన్న బియ్యం వేయాలని చెప్పిన కేసీఆరే ఇప్పుడు వద్దంటున్నారని ధ్వజమెత్తారు. కల్లాల్లో ఉన్న వానాకాలం ధాన్యం సేకరించకుండా యాసంగి పంట గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించింది . మాఫియాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని ఆరోపించారు.

దళిత బంధు పథకం ఎందుకు కొనసాగించట్లేదని నిలదీశారు. ఈ పథకం అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీలోకి నాయకుడు వస్తేనే పార్టీలో చేరికలు కొనసాగుతున్నట్లు కాదని, సాధారణ ప్రజలు భారీగా చేరుతున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేకుంటే ఢిల్లీలో రైతుల ఉద్యమం కొనసాగేదా అని ప్రశ్నించారు. రైతులు ధర్నా చేస్తుంటే వారికి అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. 

ఐదు తీర్మానాలకు బీజేపీ ఆమోదం... 
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రైతు సమస్యలు, దళిత బంధు, ధరణి, నిరుద్యోగ సమస్యలపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఐదు తీర్మానాలను ఆమోదించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు పెంచాలని డిమాండ్‌ చేసింది. టీఆర్‌ఎస్‌ నేతలకు ఇసుక అక్రమ వ్యాపారం నిత్య ఆదాయంగా మారిందని ఆరోపించింది. దళిత బంధు నెపంతో ఎస్సీ సబ్‌ ప్లాన్, కార్పొరేషన్‌ సబ్‌ ప్లాన్‌ను కార్పొరేషన్‌ సబ్సిడీలను ప్రభుత్వం ఎత్తేయాలని భావిస్తోందని, ఎస్సీలను మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని, వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేసింది. ప్రత్యామ్నాయ పంటల కోసం సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించాలని సూచించింది. వడ్డీ లేకుండా పంట రుణాలు ఇవ్వాలని, ఫసల్‌ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. రెవెన్యూ సంస్కరణల పేరుతో కేసీఆర్‌ తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించింది.

ధరణి లోపాలను సరిదిద్దాలని కోరింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల విలువైన భూములను టీఆర్‌ఎస్‌ అవినీతి కేంద్రాలుగా మార్చుకుందని ఆరోపించింది. ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తింది. వెంటనే నిరుద్యోగ భృతి బకాయిలతో చెల్లించాలని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, ఉద్యోగ నియామక కేలండర్‌ విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని తదితర తీర్మానాలపై చర్చించాక సమావేశం ఆమోదించింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top