మరోసారి ప్రజల్లోకి..

Telangana Congress Party Planning To Protest TRS Government Failures - Sakshi

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్‌ ప్రణాళిక 

సభ్యత్వ నమోదు పూర్తి కాగానే కార్యాచరణ షురూ 

రాహుల్‌ ముఖ్యఅతిథిగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిరుద్యోగ సభ!

పాదయాత్ర దిశగా రేవంత్‌ ఆలోచన

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మరోమారు ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మూడు ముఖ్య అంశాలను ఎంచుకుని ప్రజల వద్దకు వెళ్లాలని ఆ పార్టీ ముఖ్య నేతలు యోచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని రైతు రుణమాఫీ, ఉద్యోగాల కల్పన–నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టే యోచనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉన్నట్టు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ మూడు అంశాలపై పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయికి పంపడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపేలా భారీ బహిరంగ సభలను నిర్వహించే దిశలో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రైతులు, నిరుద్యోగ యువతతో పాటు పేద, మధ్య తరగతి ప్రజల పక్షాన చేపట్టే ఆందోళనలు పార్టీ ఇమేజ్‌ను మరింత పెంచుతాయని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌–బీజేపీలు పరస్పరం నిందించుకోవడం మినహా ప్రభుత్వాల నిర్వాకాలపై ఆ పార్టీలు ఆందోళనలు చేసే పరిస్థితుల్లో లేనందున కాంగ్రెస్‌కున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్‌ శిబిరం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అందులో భాగంగా నిరుద్యోగుల పక్షాన భారీ ఎత్తున బహిరంగ సభను సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించి, ఆ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానించేందుకు.. గతంలోనే ఉన్న ప్రతిపాదనను అమల్లోకి తేవాలని రేవంత్‌ యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ సభ తర్వాత ఏఐసీసీ ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశముందని, అయితే ఎన్నికలకు సమయం లేకుంటే మాత్రం ఈ ఆలోచనను విరమించుకునే అవకాశముందని చెబుతున్నారు. 

సభ్యత్వంతో జోష్‌ 
డిజిటల్‌ సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంలో ఉత్సాహాన్ని పెంచుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను చేయిస్తామని ఏఐసీసీకి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్‌ 9 నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదట్లో కొంత మందకొడిగానే నడిచింది. ఆ తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీ కోఆర్డినేటర్ల నియామకంతో పాటు డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమీక్షలు చేసిన తర్వాత వేగం పుంజుకుంది.

కేవలం రెండు నెలల కాలంలోనే 34 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి. ఒక్క నల్లగొండ పార్లమెంటు పరిధిలోనే 4.5 లక్షల సభ్యత్వం నమోదయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 20–30 వేల వరకు సభ్యత్వాలు పూర్తయ్యాయి. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరింత క్రియాశీలంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించిన టీపీసీసీ.. సభ్యత్వ టార్గెట్‌ను 50 లక్షలకు పెంచడం గమనార్హం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top