జవాన్లకు అవమానం

Telangana: Bandi Sanjay Sensational Comments On CM KCR - Sakshi

పాక్‌ ఉగ్రవాదులు, ఐఎస్‌ఐ తీవ్రవాదులతో ఆయనకు సంబంధాలు

ముఖ్యమంత్రిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర ఆరోపణలు

సర్జికల్‌ స్ట్రైక్స్‌ను అనుమానించేలా మాట్లాడటం గర్హనీయమని మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: ‘సీఎం కేసీఆర్‌ దేశద్రోహి. ఆయనకు పాకిస్తాన్‌ ఉగ్రవాదులు, ఐఎస్‌ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నాయి. సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా, పాక్‌ భూభాగంలో వారు జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను అనుమానించేలా దేశద్రోహిగా కేసీఆర్‌ మాట్లాడటం అత్యంత గర్హనీయం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ భారతీయుడైతే ఆయన చేసిన వ్యాఖ్యలకు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సోమవారం సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌పై ప్రధాని మోదీ చెప్పింది నువ్వు నమ్ముతలేవ్‌. దేశంలో జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుకున్న టెర్రరిస్టు మసూద్‌ అజహర్‌ చెప్పింది నమ్ముతవా? జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ గొప్ప ఘనకార్యాన్ని నువ్వు తప్పుపడతవా? ఆయన చనిపోయినప్పుడు పొగుడుతూ ఎందుకు ట్వీట్‌ చేసినవ్‌’అంటూ నిలదీశారు.

కేసీఆర్‌ వ్యాఖ్యలతో దేశం తలదించుకుంది...
కేసీఆర్‌ మీడియా సమావేశంలో సైన్యానికి చేసిన అవమానానికి యావత్‌ భారతం సిగ్గుతో తలదించుకుందని సంజయ్‌ పేర్కొన్నారు. పుల్వామాలో పాక్‌ ఉగ్రవాదులు 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను చంపితే సైన్యం వాళ్ల ఇంట్లోకి (భూభాగంలోకి) వెళ్లి సర్జికల్‌ స్ట్రైక్‌ చేసిందన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌పై రాహుల్‌ గాంధీ, కేసీఆర్‌ తప్ప యావత్‌ భారతం పండుగ చేసుకుందన్నారు. ‘సైనికుల త్యాగాలకు ప్రూఫ్‌ అడుగుతావా? ప్రతి ఒక్కరూ తల్లిని ఎట్ల నమ్ముతరో.. యావత్‌ భారతం సైనికుల త్యాగాలను నమ్ముతుంది. పాకిస్తానోడే అడగలే ప్రూఫ్‌. పాక్‌ ఉగ్రవాదులను మన సైనికులు చంపితే నీకేం కడుపు మంట’అని సంజయ్‌ నిలదీశారు.

నాడు నువ్వే పొగిడావ్‌... 
‘బీజేపీ అవినీతి పార్టీయా? మమ్మల్ని తరిమికొట్టకపోతే దేశం ఆగమైపోతదా? నీలాంటి సన్నాసి అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటరు. అవినీతి లేకుండా 8 ఏళ్లుగా పాలిస్తున్న ప్రభుత్వం మాది. మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవంలో ఇది నువ్వే అన్నవ్‌’ అని సంజయ్‌ గుర్తుచేశారు. గతంలో మోదీ పాల్గొన్న సభల్లో కేసీఆర్‌ పొగిడిన ప్రసంగాల టేప్‌లను ఈసందర్భంగా ప్రదర్శించారు. 

నీపై ఎంక్వైరీ మొదలైంది.. 
‘దేశంలోనే అత్యంత అవినీతిపరుడు కేసీఆర్‌. నువ్వు జైలుకు పోవడం 100 శాతం గ్యారంటీ. సీఎం అయ్యాక ఒక రోజంతా సీబీఐ నీ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిన మాట వాస్తవమేనా? ఇప్పుడు మళ్లీ ఎంక్వైరీ స్టార్ట్‌ అయ్యింది. దీనికితోడు నీ ఇంట్ల సీఎం సీటు పంచాయితీ ఎక్కువైంది. వాటిని తప్పించుకునేందుకు ఈ కథలన్నీ పడుతున్నవ్‌’ అని ధ్వజమెత్తారు. 

కాబోయే పీసీసీ చీఫ్‌ కేసీఆరే 
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కాబోయే అధ్యక్షుడు కేసీఆరేనని ఎద్దేవా చేస్తూ సంజయ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘నెక్స్‌ట్‌ పీసీసీ చీఫ్‌ కేసీఆరే. 10 జన్‌పథ్‌ నుంచి కేసీఆర్‌కు స్క్రిప్ట్‌. రాబోయే రోజుల్లో ప్రగతి భవన్‌ నుంచి గాంధీ భవన్‌కు మారబోతున్నారు. న్యాయ వ్యవస్థ, ప్రధాని ఇతర వ్యవస్థలపై కేసీఆర్‌కు నమ్మకం లేదు. రఫేల్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునూ ధిక్కరిస్తున్న కేసీఆర్‌. నోరుజారితే రఫేల్‌ రెక్కలకు కడుతం’అంటూ ట్వీట్‌ చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top