ఇంటూరికి ఇంటి పంచాయితీ.. రామారావు, శివరాం ఎవరికివారే, టీడీపీ-దారేది?

TDP Situation Worse At Kandukur Over Internal Fights - Sakshi

కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అనాథగా మారిపోయిందా? ఎవరికి వారు పార్టీని పట్టించుకోకపోవడంతో మిగిలిన కేడర్ పరిస్థితి ఏంటి? సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని కార్యకర్తలకు దిక్కెవరు? అసలు కందుకూరు సెగ్మెంట్లో టీడీపీ ఎందుకిలా దివాలా తీసింది.?

ఒకప్పుడు పచ్చ పార్టీకి కంచుకోటగా ఉండే కందుకూరు నియోజకవర్గంలో 2009 నుంచి పరిస్థితి మారిపోయింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న దివి శివరాంను 2009లో కాంగ్రెస్ అభ్యర్థి మానుగుంట మహీధరరెడ్డి ఓడించారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పోతుల రామారావు చేతిలో దివి శివరాం మరోసారి ఓడిపోయారు. సిటింగ్ ఎమ్మెల్యే పోతుల రామారావు తెలుగుదేశానికి అమ్ముడు పోయాక.. ఇక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పని అయిపోయిందంటూ ఎల్లో బ్యాచ్ ప్రచారం చేసింది.

2019 ఎన్నికలల్లో వైఎస్సార్సీపి అభ్యర్దిగా బరిలో దిగిన మానుగుంట మహిధర్ రెడ్ది టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుల రామారావుపై ఘనవిజయం సాధించారు. ఓటమి తరువాత పోతుల రామారావు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. గత ఎన్నికల తరువాత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎన్నికల్లో ఓడిపోయిన పోతుల రామారావు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో.. అక్కడ పార్టీ ఇంచార్జ్‌గా ఇంటూరి నాగేశ్వరరావుని టీడీపీ నాయకత్వం నియమించింది.

కొత్త ఇంచార్జ్‌ నియమించడంతో పార్టీ నాయకత్వానికి తలనొప్పి మొదలైంది. ఇంటూరి నాగేశ్వరరావు కజిన్ ఇంటూరి రాజేష్‌కు నెలూరు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు ఇవ్వడంతో పార్టీలో వర్గపోరు ప్రారంభమైంది. నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవరిస్తున్నారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనవరిలో చంద్రబాబు పర్యటన సందర్బంగా రాజేష్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో నాగేశ్వరరావు ఫొటో లేకపోవడంతో గొడవలు కూడా జరిగాయి. ఈ విషయం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా చూసి చూడనట్టు వ్యవహరించడంతో నియోజకవర్గంలో గొడవలు రోజు రోజుకి ఎక్కువతున్నాయి. పార్టీ కార్యక్రమాలు కూడా ఎవరికి వారుగా నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

గత ఎన్నికల్లో తనకు కాకుండా ఎమ్మెల్యే పోతుల రామారావుకు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పైగా గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఇంచార్జ్‌ బాధ్యతలు కూడా కొత్తగా వచ్చిన ఇంటూరి నాగేశ్వరరావుకి ఇవ్వడాన్ని శివరాం జీర్ణించుకోలేకపోతున్నారు.

కొత్త వ్యక్తికి అప్పగించడం శివరాంను అవమానించడమేనని ఆయన అభిమానులు రగిలిపోతున్నారు. అవసరానికి వాడుకోవడం ఆ తరువాత వదిలెయ్యడం చంద్రబాబుకు అలవాటే అని టీడీపీ కార్యకర్తలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మొత్తంగా కందుకూరు టీడీపీ ఎవరికి పట్టనట్లుగా తయారై కేడర్ చెల్లాచెదురవుతోంది.
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి వెబ్‌డెస్క్‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top