వెనుకబడిన ప్రాంతాలను విస్మరించిన చంద్రబాబు

Somu Veerraju Comments On Chandrababu - Sakshi

అమరావతి మినహా ఐదేళ్లు మరేమీ కన్పించలేదు 

గత ప్రభుత్వ అవినీతి కారణంగా రాష్ట్రం అప్పులపాలు 

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 

సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి గాంధీరోడ్డు/తిరుపతి తుడా/సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రను పూర్తిగా విస్మరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పేర్లు మినహా మరో ఊసే ఆయనకు పట్టలేదన్నారు. ఏపీకి దక్కాల్సిన నికర జలాలు సాధించడంలోనూ విఫలమయ్యారని తప్పుబట్టారు. తిరుపతిలో శనివారం భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సోమువీర్రాజు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం అవినీతి కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా అవినీతిలో అదే తరహా పాలనను కొనసాగిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.  

స్థానిక ఎన్నికలపై టీడీపీది కపట ప్రేమ 
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీది కపట ప్రేమేనని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు పదవీ కాలం ముగిసినా గడువులోగా ఎన్నికలు నిర్వహించ లేదని బీజేపీ నేతలు తప్పుబట్టారు. అగ్రవర్ణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం అమలుపరచలేదని విమర్శించారు. కాగా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాలే మిన్నగా భావించే పార్టీల వల్ల రాష్ట్రం నష్టపోతుందని తీర్మానంలో ఆ పార్టీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యకర్తలతో మాట్లాడారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శులు సత్యకుమార్, మురళీధరన్, రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్, పీవీఎన్‌ మాధవ్, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

జనసేనతో కలిసి తిరుపతిలో పోటీచేస్తాం.. 
తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో జనసేనతో కలసి బీజేపీ అభ్యర్థే పోటీలో ఉంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యవర్గ సమావేశంలో రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు, రాయలసీమ డిక్లరేషన్‌పై చర్చించినట్లు తెలిపారు. పోలవరం వద్ద వాజ్‌పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కూడా చర్చించామన్నారు. తిరుపతి మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వీర్రాజు మాట్లాడుతూ.. రానున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే తిరుపతిని స్వర్ణమయం చేస్తామని తెలిపారు. తిరుపతిని రూ. 1,000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ సుముఖంగా ఉన్నారన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top